తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్య, తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను బలోపేతం చేసేందుకు పెద్దపీట వేస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్ థర్డ్ వేవ్ నుండి బయటపడేందుకు తెలంగాణ విజయవంతంగా చర్యలు చేపట్టడంతో పాటు మల్టీస్పెషాలిటీ హెల్త్ హబ్‌లు, మెడికల్ కాలేజీలు, దాదాపు అన్ని ప్రధాన తృతీయ శ్రేణి ఆసుపత్రులను రూ.6,000 కోట్లతో అప్‌గ్రేడ్ చేయడం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ ప్రయత్నాలలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మెడికల్ కాలేజీలు, వరంగల్‌లో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మరియు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)తో సమానంగా తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) గా పిలువబడే నాలుగు మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తోంది. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డిలోని 8 మెడికల్ కాలేజీలు అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.550 కోట్లు కేటాయించి, మొత్తం రూ.4,400 కోట్లు వెచ్చించింది. అంతే కాకుండా, వరంగల్‌లో ప్రతిష్టాత్మకమైన 2,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, హెల్త్ హబ్‌ను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,100 కోట్లు కేటాయించింది.