సింగరేణి సంస్థలో జరుగుతున్న టెండర్ల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకతను పక్కన పెట్టి, తన సొంత బంధువులకు , అనుకూలమైన కాంట్రాక్టర్లకు మేలు చేసేలా నిబంధనలను మార్చిందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా సంస్థకు చెందిన నిధులను పక్కదారి పట్టిస్తూ, బొగ్గు గనుల టెండర్లలో వేల కోట్ల రూపాయల స్కామ్‌కు తెరలేపారని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు.
తెలంగాణ జీవనాడి అయిన సింగరేణి సంస్థను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ఆటవస్తువులా మార్చుకుందని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి విదేశాల్లో పర్యటిస్తూ తాను కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని చెప్పుకుంటున్నప్పటికీ, రాష్ట్రంలో మాత్రం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణికి సంబంధించిన సుమారు 10 కోట్ల రూపాయల నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఫుట్బాల్ క్రీడల కోసం దుర్వినియోగం చేశారని, ఇది సంస్థకు తీరని అన్యాయం చేయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వినోదం కోసం సంస్థ నిధులను వాడుకుంటూ, కార్మికుల కష్టార్జితాన్ని పక్కదారి పట్టిస్తున్నారని, రాష్ట్ర ప్రజలతో ప్రభుత్వం ఫుట్బాల్ ఆడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
2026 T20 World Cup: బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఐసీసీ.. దెబ్బ అదుర్స్ కదూ!
సింగరేణిలో ‘ఓవర్ బర్డన్’ (OB) టెండర్ల ప్రక్రియలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని కేటీఆర్ ఆధారాలతో సహా వివరించారు. భారతదేశంలోని ఏ బొగ్గు గనిలోనూ లేని ‘సైట్ విజిట్ సర్టిఫికేషన్’ అనే విధానాన్ని ఇక్కడ ఎందుకు అమలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ నిబంధన రాకముందు జనవరిలో జరిగిన టెండర్లలో కంపెనీలు అంచనా వ్యయం కంటే 7 శాతం తక్కువకే పని చేయడానికి ముందుకు వచ్చాయని, కానీ ఆ టెండర్లను ఉద్దేశపూర్వకంగా రద్దు చేసి కొత్త నిబంధనను తెచ్చారని మండిపడ్డారు. దీనివల్ల ఇప్పుడు అదే పని కోసం అంచనా వ్యయం కంటే 12 శాతం అదనంగా అంటే ‘ప్లస్ టెండర్ల’ రూపంలో వందల కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది కేవలం కొంతమంది కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడానికేనని స్పష్టం చేశారు.
ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావమరిది సృజన్ రెడ్డి ‘రింగ్ మాస్టర్’గా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెండర్ వేయడానికి కావాల్సిన సైట్ విజిట్ సర్టిఫికేట్లను కేవలం కొంతమంది సెలెక్టివ్ కాంట్రాక్టర్లకే జారీ చేస్తూ, మిగిలిన వారిని పోటీ నుంచి తప్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి బంధువుల ప్రమేయంపై తాము సూటిగా ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని విమర్శించారు. ఒడిశాలోని ‘నైనీ’ బొగ్గు గని టెండర్లలో కూడా ఇదే తరహా అక్రమాలు జరుగుతున్నాయని, ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి నిజానిజాలను ప్రజల ముందు ఉంచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.