KTR Delhi Tour: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. వివిధ ప్రాజెక్టులు, పథకాలు, అభివృద్ధి అంశాల్లో అందించాల్సిన సాయంపై కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి మద్దతు కోరుతోంది. అయితే బీజేపీ ప్రభుత్వం మాత్రం అనేక అంశాల పట్ల నిర్లక్ష్యం ధోరణి ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లను ఆయన గట్టిగా వినిపించనున్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిర్వహణ కోసం ఎస్‌ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా తలపెట్టిన సాయి వేల నిర్మాణానికి కంటోన్మెంట్ భూములు కావాలని రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖను కోరుతోంది. ఈ విషయంలో ఇప్పటి వరకు కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నేరుగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి కంటోన్మెంట్ భూముల అంశాన్ని ప్రస్తావించనున్నారు.
Read also: Lover: ప్రేయసి కోసం కాస్లీ గిఫ్ట్.. అందుకోసం ఏం చేశాడంటే..?
రసూల్‌పురా వద్ద చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులకు హోంశాఖ ఆధ్వర్యంలో భూమి అవసరం. ఇందుకు అవసరమైన సహకారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది.వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయంపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లేదా వీకే సింగ్‌తో సమావేశమై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని కోరే అవకాశం ఉంది. పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో ఆయన సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లో మెట్రో పరిధిని పొడిగించాలని ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. హర్దీప్‌సింగ్‌పురితో భేటీలో ఈ విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఇతర అంశాలపై ఆయా శాఖల కేంద్ర మంత్రులతో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నట్లు సమాచారం. పెండింగ్ సమస్యలపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన, హామీ రాకపోతే.. మోడీ సర్కార్ తీరును ఎండగట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చేస్తున్న అడ్డంకులను ప్రజలకు వివరించి బీజేపీ నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకు ప్లాన్ వేసినట్లు తెలిసింది.
CM Jagan : నేడు జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం