KTR : రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్..

  • మహిళా నేతలపై దాడిని ఖండించిన కేటీఆర్
  • స్పీకర్ పదవిపై రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్
  • 420 హామీల అమలుపై తీవ్ర విమర్శలు
  • హిట్లర్ పాలనతో రేవంత్‌కు పోలిక
Ktr

Ktr

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తీవ్రమైన రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మహిళా నేతలపై దాడిని ఖండించిన కేటీఆర్

శాసనసభ వేదికగా తమ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నాయకులు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డిలపై జరిగిన దాడి , అనుచిత ప్రవర్తనను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళా ప్రజాప్రతినిధులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

స్పీకర్ పదవిని, కులాన్ని వాడుకుంటున్నారు

ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీ స్పీకర్ హోదాను, కులాన్ని రాజకీయం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరణించాలని రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారని, కేసీఆర్ ఇంటిపైకి కార్యకర్తలను రెచ్చగొట్టి పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారం లేని ఇటువంటి వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా గాయపరిచాయని ఆవేదన వ్యక్తం చేశారు.

420 హామీల అమలులో ఘోర వైఫల్యం

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ‘420 హామీలను’ నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు భరోసా, మహిళలకు ఆర్థిక సాయం వంటి కీలకమైన సంక్షేమ పథకాలను పక్కనబెట్టారని ఆరోపించారు. తమ వైఫల్యాలను ఎండగడుతున్న బీఆర్‌ఎస్ శాసన మండలి సభ్యులను బెదిరిస్తూ, సస్పెండ్ చేస్తామని హెచ్చరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి పాలనపై హిట్లర్ పోలిక

ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనను కేటీఆర్ నాడు జర్మనీలో సాగిన హిట్లర్ నిరంకుశ పాలనతో పోల్చారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డికి కూడా భవిష్యత్తులో హిట్లర్ తరహా గతే పడుతుందని తీవ్రంగా హెచ్చరించారు. ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు, ఆడబిడ్డలకు జరిగిన అవమానానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగేది లేదని తేల్చి చెప్పారు.