Site icon NTV Telugu

KTR : తులం బంగారం కాదు.. తులం ఇనుము కూడా ఇవ్వరు

Kavitha Ktr

Kavitha Ktr

KTR : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయని, కానీ తమకు అండగా నిలిచిన మాగంటి కుటుంబానికి అండగా నిలబడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలను ప్రతి కార్యకర్త తన సొంత పోరాటంగా భావించి పనిచేయాలని ఆయన ఉద్ఘాటించారు.

కాంగ్రెస్ నాయకులు ‘హైడ్రా’ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆ డబ్బులతో జూబ్లీహిల్స్‌లో ఓట్లు కొనాలని చూస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా, కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లను రాయించారని, వాటిని తొలగించే బాధ్యతను బీఆర్ఎస్ నాయకులు తీసుకోవాలని సూచించారు. అక్టోబర్ చివరి వారంలో గానీ, నవంబర్ మొదటి వారంలో గానీ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, బీహార్‌తో పాటు ఈ ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు.

Nara Lokesh: ఖాట్మండులో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకొస్తాం..!

కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు జిల్లాల్లో ప్రజలు మోసపోయారని, కానీ హైదరాబాద్ ప్రజలు మాత్రం వారిని నమ్మలేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు తులం బంగారం ఇచ్చేవాళ్ళు కాదు, మెడలో పుస్తెలను గుంజుకెళ్లే వాళ్ళు అంటూ తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తులం బంగారం కాదు కదా, తులం ఇనుము కూడా ఇవ్వడని ఎద్దేవా చేశారు. బతుకమ్మ, దసరా పండుగల ముందు ప్రజల వద్దకు వెళ్లి వారి అవసరాలు తీర్చాలని కార్యకర్తలకు సూచించారు.

గతంలో మైనారిటీ నాయకుడైన అజారుద్దీన్‌కు సీటు ఇచ్చి, ఇప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వకుండా బాగా డబ్బులు ఉన్నవారికి ఇస్తున్నారని కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మైనారిటీలకు టికెట్ ఇవ్వనప్పుడు వారు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు పైసలు ఇస్తే తీసుకోవాలని, కానీ ఓటు మాత్రం తమకే వేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు జూబ్లీహిల్స్ రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది.

Kishkindhapuri : కిష్కింధపురి.. ఆడియెన్స్ కు నచ్చకుంటే ఇండస్ట్రీ వదిలి వెళ్తా : బెల్లం కొండ

Exit mobile version