Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..

  • కేటీఆర్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం
  • ఫామ్‌హౌస్‌లు, భూములపై సంచలన ఆరోపణలు
  • డ్రగ్స్ దందాపైనా మంత్రి కీలక వ్యాఖ్యలు
  • ఉపఎన్నికలకు భయపడేది లేదన్న కోమటిరెడ్డి
Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy : మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రధాన రహదారులు, వంతెనల నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తూ, బిఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఫామ్‌హౌస్‌లు, డ్రగ్స్ దందాపై తీవ్ర ఆరోపణలు

కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. ప్రజల సొమ్మును దోచుకుని వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు కడితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. అసైన్డ్ భూములు, లావుణి పట్టా భూములతో పాటు 111 జీవో పరిధిలోని స్థలాల్లో డ్రగ్స్ దందా సాగిస్తుంటే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అక్రమంగా కొల్లగొట్టిన ప్రభుత్వ భూములను తిరిగి రికవరీ చేసి తీరాలని స్పష్టం చేశారు. గతంలో ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటూ కేటీఆర్ బావమరిది పట్టుబడిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

పశువుల్లా కొనుగోలు చేశారు.. ఉపఎన్నికలకు భయం లేదు!

తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ తనకు ఎలాంటి ఫామ్‌హౌస్ లేదని మంత్రి తెలిపారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితిని అడ్డం పెట్టుకుని బిఆర్ఎస్ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉపఎన్నికలు అంటే ఎలాంటి భయం లేదని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.