Komatireddy Venkat Reddy Comments on revanth reddy: కాంగ్రెస్ పార్టీలో కొత్త చిచ్చు మొదలైంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిన్న కోమటి రెడ్డి బ్రదర్స్ పై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి బ్రదర్స్ పై రేవంత్ రెడ్డి తప్పుగా మాట్లాడారని.. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి ఆయనకు ఇష్టమున్న పార్టీలోకి వెళుతున్నారు.. రేవంత్ రెడ్డి నన్ను ఇందులోకి అనవసరంగా లాగొద్దని హెచ్చరించారు. పార్టీ ఏది ఆదేశిస్తే అది పాటిస్తా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్న రేవంత్ రెడ్డి.. మీరు కాంగ్రెస్ పార్టీ లేకపోతే బ్రాండ్ లేదు.. బ్రాందీ షాపులో పనిచేసేవారని వ్యాఖ్యానించారని.. అయితే ఇందులో మీరు అని సంభోధించడం బాధించిందని.. 34 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి నా జీవితాన్ని అంకితం చేశానని.. తెలంగాణ ఉద్యమంలో పనిచేశానని.. ఈ రోజు నన్ను అనవసరంగా విమర్శించారని అన్నారు. మీరు అనే పదాన్ని వాడాడని.. మేం సొంతంగా కష్టపడి పైకి వచ్చామని ఆయన అన్నారు. వెంటనే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
నేను ఎన్ఎస్ యూఐలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి స్కూల్ లో ఉన్నాడని.. నన్ను రెచ్చగొట్టద్దని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్ది వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి ఇలా వ్యాఖ్యానించడం తప్పని.. మేము ఎప్పుడూ నిజాయితీగా ఉన్నామని.. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేకు రాజీనామా చేసి ఓ జాతీయ పార్టీలోకి వెళ్తున్నాడని.. టీడీపీ ఎమ్మెల్యేగా ఉండీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరలేదా..? అని ప్రశ్నించారు. ఇద్దరు ఎంపీలు ఢిల్లీలో ఉన్నారని.. నేషనల్ హెరాల్డ్ కేసులో నిరసనల్లో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి విషయం ఆయన్నే అడగాలని అన్నారు. మేం నిజాయితీగా వ్యాపారం చేశామని..ఎవ్వరినీ మోసం చేయలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నేను కరడుగట్టిన కాంగ్రెస్ వాదిని అని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ, మల్కాజ్ గిరి ప్రాంతంలో ఎన్ని మున్సిపాలిటీలు గెలిచారు.. భువనగిరి ప్రాంతంలో ఎన్ని స్థానాలు గెలిచారనేది చూస్తే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఏంటో తెలుస్తుందని ఆయన అన్నారు.