Shabbir Ali comments on Komatireddy Rajgopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయం అయింది. అయితే కాంగ్రెస్ పార్టీ వీడిన రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ కోమటిరెడ్డి వ్యవహారంలో విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. నాయకులు ఒకరికి ఒకరు వార్నింగులు ఇచ్చుకుంటున్నారు.
Read Also: Command Control Centre: రేపే కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి తనకు పీసీసీ ఇవ్వాలని అన్నారని.. తన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పీసీసీ ఇవ్వద్దన్నాడని బాంబ్ పేల్చాడు. రేవంత్ రెడ్డి లేకపోతే నాకు పీసీసీ ఇవ్వాలని అడిగారని షబ్బీర్ అలీ వెల్లడించారు. నా ఇంటికి వచ్చి రాజగోపాల్ రెడ్డి నన్ను ప్రపోజల్ పెట్టాలని అడిగారని.. దీనికి నేనే ప్రత్యక్ష సాక్షినని.. దమ్ముంటే ఒట్టేసి ఇది అబద్ధమని చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ పాలు తాగి వెన్నుపోటు పొడిచాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో ఉండీ అమిత్ షాను చాలా సార్లు కలిశా అని ఆయనే చెప్పారని అన్నారు. కాంట్రాక్టర్ గా ఉన్న రాజగోపాల్ రెడ్డి డిఫాల్టర్ గా మారారని కోట్ల అప్పులున్నాయని.. వాటి కోసమే రాజగోపాల్ రెడ్డి అమిత్ షాను కలిశారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మునుగోడుకు ఏ రోజైనా వెళ్లావా అని రాజగోపాల్ రెడ్డిని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. మునుగోడు అభివృద్ధి ఇప్పుడే గుర్తుకు వచ్చిందా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, పీసీసీ చీఫ్ లను విమర్శించే స్థాయి నీకు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నిన్ను బొందపెడతారని హెచ్చరించారు.