Kishan Reddy Controversial Comments On CM KCR: మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ డబ్బులను దోచుకొని, కేసీఆర్ విమానాలు కొంటున్నారని విమర్శించారు. ఈ దేశంలో మొత్తం 50 రాజకీయ పార్టీలుంటే, ఏ ఒక్క పార్టీ దగ్గర కూడా విమానం లేదని, మరి కేసీఆర్‌కి విమానం కొనేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణలో సంపాదించిన డబ్బును.. విమానాల్లో తిరుగుతూ కేసీఆర్ దేశమంతా పంచుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ పోరాటంలో మొత్తం 1200 మంది ప్రాణత్యాగాలు చేశారని, వాళ్లు తమ ప్రాణాల్ని త్యాగం చేసింది కేసీఆర్ కుటుంబం కోసమా? అని ప్రశ్నించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు వస్తాయని, ప్రజల జీవితం బాగుపడుతుందని అనుకున్నామని.. కానీ తెలంగాణను కేసీఆర్ అప్పుల్లో ముంచేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. చిన్నపిల్లలు సహా ఒక్కొక్కరి నెత్తి మీద రూ. లక్ష చొప్పున.. ఐదు లక్షల కోట్ల రూపాయల్ని కేసీఆర్ అప్పు తెచ్చారని అన్నారు. అనేక మంది తమ ప్రాణాలు త్యాగం చేస్తే, ఇప్పుడు కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని ఏలుతోందని చెప్పారు. విమానాలు కొనడమే కాకుండా ఇసుక, భూమి, లిక్కర్ వంటి స్కామ్‌లకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. తెలంగాణను దోచుకున్న కేసీఆర్.. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి దోచునేందుకు ప్లాన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ మొత్తం తన కుటుంబానికి బానిసగా ఉండాలన్నది కేసీఆర్ కుటుంబం కోరిక అని చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వం నిజాం, రజాకార్ల పాలనను తలపిస్తోందని.. తెలంగాణ తల్లి కేసీఆర్ కుటుంబంలో బందీగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను తమ పథకాలుగా టీఆర్ఎస్ మారుస్తోందన్నారు. ఫామ్ హౌస్ నుంచి బయటకు రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం బందీ నుంచి తెలంగాణను విముక్తి చేద్దామని పిలుపునిచ్చారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆంక్షకు ఈ మునుగోడు ఎన్నికలు కీలకమని చెప్పారు. కేసీఆర్ కుటుంబానికి కర్రు కాల్చి వాత పెట్టాలని.. రాష్ట్రంలో కుటుంబం పెత్తనం లేకుండా చేయాలంటే రాజగోపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు.