ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త వ్యవహారం సంచలనంగా మారిపోయింది… నిత్యం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ.. సోషల్‌మీడియాలోను ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెడుతుంటాడు సాయి గణేష్… వచ్చే నెల నాలుగో తేదీన పెళ్లి జరగాల్సి ఉంది.. కానీ, ఇంతలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయి గణేష్ చనిపోవడంతో.. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ సాయి గణేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల సమక్షంలోనే స్టేషన్‌లో పురుగు మందు తాగడంతో.. అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు.
Read Also: TRS Foundation Day: ఆసక్తికరంగా మారిన టీఆర్ఎస్ రాజకీయ తీర్మానం..!
ఇక, పోలీసులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో మాట్లాడిన సాయి గణేష్ తాను ఆత్మహత్య యత్నం చేయడానికి కారణాలను వివరించారు. మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులతోనే పురుగుల మందు తాగినట్టు సాయిగణేష్ చెప్పాడు. మంత్రి ఆగడాలు ఎక్కవయ్యాయని… పోలీసులను గుప్పిట్లో పెట్టుకొని తనను టార్చర్ పెట్టాడని అన్నాడు. టార్చర్ తట్టుకోలేకే ఆత్మహత్య యత్నం చేశానన్నాడు. మరోవైపు, సాయి గణేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో బీజేపీ నేతలు.. హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సాయి గణేష్ మృతి చెందాడు. సాయిగణేష్‌పై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 16 కేసులు పెట్టారు పోలీసులు. అంతేకాదు పీడీ యాక్ట్ నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేశారు. సాధారణంగా దోపిడీలు, హత్యలు చేసేవాళ్లు, పదే పదే నేరాలకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్, రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. కానీ, బీజేపీ కార్యకర్త అయిన సాయిగణేష్‌పై పోలీసులు ఎందుకు ఇలాంటివి నమోదు చేశారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదంతా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రమేయంతోనే జరిగిందని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి… సాయి గణేష్ మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. పోస్టుమార్టం పూర్తయ్యేంత వరకూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోస్టు మార్టం ఆలస్యం కావడంతో… బీజేపీ కార్యకర్తల్లో అసహనం పెరిగిపోయింది. దీంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మంత్రి పువ్వాడతో పాటు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. రోడ్డెక్కి ప్లెక్సీలను చించివేశారు. ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల కారణంగానే పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని బీజేపీ నేతలు నినాదాలు చేశారు. అదే సమయంలో పోలీసులకు… బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవేశంతో బీజేపీ కార్యకర్తలు ఆస్పత్రి వద్ద ఉన్న అద్దాలను పగులగొట్టి… ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి భారీ పోలీస్ బందోబస్తు మధ్య సాయి గణేష్ అంతిమయాత్ర నిర్వహించారు బీజేపీ కార్యకర్తలు . యాత్ర జరుగుతున్న సమయంలో కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు తరలిరావడంతో మళ్లీ టెన్షన్ వాతావరణం తలపించింది. టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు రాకుండా అడుగడుగునా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాయంత్రం 6 గంటలకు సాయి గణేష్ అంతిమయాత్ర ముగిసింది. మొత్తానికి బీజేపీ కార్యకర్త… మరణం.. ఇప్పుడు ఖమ్మం రాజకీయాలను ఒక్కసారిగా హీట్ పుట్టించింది. మంత్రి పువ్వాడ అజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు.. మంత్రిని వదిలిపెట్టేది లేదని హెచ్చరిస్తున్నారు.