సీఎం కేసీఆర్ శుక్రవారం (ఇవాళ) చేపట్టాల్సిన రాలేగావ్ సిద్ది (మహారాష్ట్ర) పర్యటన రద్దయినట్లు సమాచారం. ఇదివరకు సీఎంవో ప్రకటించినదాని ప్రకారం.. ముఖ్యమంత్రి మే 26న బెంగళూరు, 27న రాలేగావ్ సిద్ది పర్యటన చేపట్టాల్సి ఉంది. రాలేగావ్ సిద్దిలో ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో భేటీ కావాల్సి ఉంది. అనంతరం షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుని హైదరాబాద్‌కు చేరుకుంటారని సీఎంవో గతంలో వెల్లడించింది.
ఈమేరకు సీఎం 26న బెంగళూరుకు వెళ్లి, సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారుగానీ… 27న చేపట్టాల్సిన రాలేగావ్ సిద్ది పర్యటన గురించి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
అయితే.. తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న(26)న బెంగళూరు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో ఆయన మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని కలిసి సమావేశమయ్యారు. దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కచ్చితమైన మార్పు ఉంటుందని… దాన్ని ఎవరూ ఆపలేరని సీఎం కేసీఆర్ అన్నారు. రెండు, మూడు నెలల్లో తాను ఒక సంచలన వార్తను చెపుతానని సీఎం కేసీఆర్ అన్నారు. దేవేగౌడ, కుమారస్వామితో దేశ, కర్ణాటక రాజకీయాలపై చర్చించినట్టు చెప్పారు.
మన దేశంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయని, ఎందరో ప్రధానులు వచ్చారని… కానీ దేశ పరిస్థితులు మాత్రం బాగుపడలేదని కేసీఆర్ అన్నారు. మన కంటే వెనుకబడి ఉన్న చైనా 16 మిలియన్ల ఎకానమీగా ఎదిగిందని… మనం మాత్రం 5 ట్రిలియన్ డాలర్ల వద్దే ఉన్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. దేశంలో మంచి నాయకులు, మంచి వాతావరణ పరిస్థితులు ఉన్నాయని… అయినప్పటికీ మనం ఇప్పటికీ తాగునీరు, సాగునీరు, కరెంట్ సమస్యలతో బాధపడుతున్నామని అన్నారు సీఎం కేసీఆర్. మన దేశంలో ద్రవ్యోల్బణం రోజురోజుకు పెరుగుతోందని, జీడీపీ పడిపోయిందని చెప్పారు. కంపెనీలు మూత పడుతున్నాయని, రూపాయి విలువ దారుణంగా పడిపోయిందని అన్నారు సీఎం కేసీఆర్.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?