సీఎం కేసీఆర్ నేడు జనగామ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ రోజు సీఎం కేసీఆర్ జనగామ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం జనగామలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. అయితే టీఆర్‌ఎస్ నిర్వహించిన బహిరంగ సభ ప్రజల పాలిట భయానక సభగా మారింది. ఎందుకంటే.. టీఆర్ఎస్ సభతో హైదరాబాద్ వరంగల్ హైవే పైనా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్‌లో అంబులెన్స్ ఇరుక్కుపోయింది. దారి లేక ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్ పరిస్థితి చూసి చలించి ప్రయాణికులు, మానవత్వం చాటుకున్నారు.
అంబులెన్స్ ను పూర్తిగా ఎత్తి మరో రోడ్డు పైకి మార్చి అంబులెన్స్‌ను యువకులు పంపించారు. ట్రాఫిక్ నిర్వహణ సరిగా లేక జాతీయ రహదారిపై గంటల తరబడి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అంతేకాకుండా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు సైతం ఈ ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. నిడికొండ దగ్గర ట్రాఫిక్‌లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చిక్కుకుపోయారు. అయితే అధికార పార్టీ అధినేతే జనాలకు ఇబ్బందులు కలిగిస్తుంటే ఎలా..? అని ప్రశ్నలు చర్చించుకుంటున్నారు.