MLC Kavitha : తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తీన్మార్ మల్లన్నపై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అధికారికంగా ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, అసభ్య వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొంటూ, మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ సంస్కృతిలో మహిళలకు ప్రత్యేక గౌరవం ఉంటుందని, బోనం ఎత్తే ఆడబిడ్డలను అమ్మవారిలా చూస్తామన్నారు. అలాంటి రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ బాధ్యత లేకుండా పరుష పదజాలంతో విమర్శలు చేయడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మహిళలు రాజకీయాల్లోకి రావొద్దన్నట్లుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం?’’ అంటూ ప్రశ్నించారు.
తెలంగాణ జాగృతి తరఫున బీసీ సమస్యలపై గత సంవత్సరంన్నరగా పోరాడుతున్నట్టు కవిత తెలిపారు. తీన్మార్ మల్లన్నపై తామెప్పుడూ విమర్శలేవీ చేయలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఆయన తనపై వ్యక్తిగతంగా దౌర్జన్య పదజాలంతో మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు.
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనకు వెళ్లినప్పుడు, వారిపై కాల్పులకు దిగడం అత్యంత దుర్మార్గమని కవిత మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇదెక్కడి దుర్వినియోగమని ప్రశ్నించారు. ‘‘ఇది అధికారపరమైన దాడి కాదు.. స్వేచ్ఛపై దాడి’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసిన కవిత, తన వెంట పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇకపై జాతీయ మహిళా కమిషన్‌ను కలసి ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.
తీన్మార్ మల్లన్నను తక్షణమే అరెస్టు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిను కవిత డిమాండ్ చేశారు. ‘‘ఇలాంటి విమర్శలు రాజ్యాంగ విలువలకు, మహిళా గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయి. బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తులు తగిన సంయమనం పాటించాలి’’ అని పేర్కొన్నారు.
Banana Health Benefits: రోజూ అరటి పండ్లు తింటే బరువు పెరుగుతారా..?