మోదీ మేక్ ఇన్ ఇండియా ప్లాన్ వ్యర్ధమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారని బీజేపీ నేత కరుణా గోపాల్ అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మోదీ, నిర్మలా సీతారామన్ పై కేటీఆర్ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారని, మోదీ ప్రభుత్వంపై పారిశ్రామిక వేత్తల్లో కేటీఆర్ అపోహలు సృష్టించారని విమర్శించారు. నడ్డా అడ్డా ఎర్రగడ్డ అని కేటీఆర్ వ్యాఖ్యానించడం సరైంది కాదని, పారిశ్రామిక వేత్తలకు రాజకీయ అజెండాలు ఉండవని, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ సహకారం తీసుకుని ముందుకు వెళ్తారని ఆమె అన్నారు. కేటీఆర్ సీఐఐ సదస్సులో రాజకీయ అజెండాను అమలు చేశారని, దేశంలోనే తెలంగాణ స్టార్టప్ లో అగ్రగామిగా ఉందని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణలో స్టార్టప్ లు రెండు మాత్రమే ఉన్నాయని, చైనాను ఆదర్శంగా తీసుకుని కేటీఆర్ ప్రసంగించారని ఆమె మండిపడ్డారు.
చైనా తరహా పరిశ్రమలు నెలకొల్పాలని వ్యాఖ్యానించారని, నరేంద్రమోదీ మేక్ ఇన్ ఇండియాను కేటీఆర్ జోక్ గా తీసుకుంటున్నారని, డిఫెన్స్ కారిడార్ తెలంగాణకు ఇవ్వకుండా బుందేల్ ఖండ్ కు ఎందుకిచ్చారని నిర్మలా సీతారామన్ ను ప్రశ్నిస్తున్నారన్నారు. తెలంగాణలో డిఫెన్స్ రంగ పరిశ్రమ ఇక్కడ ఉందని, దేశ ప్రధాని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అనుకుంటారని, బుందేల్ ఖండ్ లో అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టే అక్కడ ఏర్పాటు చేశారన్నారు. మోదీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలతో ప్రజలను మోసం చేయడం కేటీఆర్ మానుకోవాలని ఆమె హితవు పలికారు.