రాష్ట్రంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వినూత్న రీతిలో నిరసనకు సిద్ధమయ్యారు. నిద్రపోతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మేల్కొలిపి ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా ఉన్న 317 జీఓను ఉపసంహరించుకునేలా రేపు రాత్రంతా కరీంనగర్‌లో జాగరణకు పిలుపునిచ్చారు. కరీంనగర్ లోని తన కార్యాలయంలో రేపు (జనవరి 2) రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు (జనవరి 3) ఉదయం 5 గంటల వరకు కొనసాగే ఈ ‘జాగరణ’ కార్యక్రమానికి మద్దతుగా పెద్ద ఎత్తున ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలివచ్చి బండి సంజయ్‌కి సంఘీభావం తెలపనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై బండి సంజయ్ మాట్లాడుతూ…నీళ్లు- నిధులు- నియామకాలు’ పేరిట తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగాలను స్థానికేతరులు కొల్లగొడుతున్నారని, స్వరాష్ట్రం వస్తేనే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నాడు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ చారిత్రకమైన సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. తాజాగా కొత్త జోనల్ వ్యవస్థలో భాగంగా రీ అలాంట్ మెంట్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో ఉద్యోగ, ఉపాధ్యాయులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోందన్నారు.
Read Also:పుస్తక అనువాదంతోనే భారతీయ సాహిత్యం విస్తరిస్తుంది: గవర్నర్ బిశ్వభూషన్
బదిలీల ప్రక్రియ పేరుతో ఈ జీవోను అమలు చేస్తే లక్షలాది ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్థానికేతరులుగా మారే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. అనారోగ్య సమస్యలున్న వారి విషయంలో, స్పౌజ్ కేసుల్లోనూ ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని ఉద్యోగులు వాపోతున్నారన్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఇటీవల మహబూబాబాద్ జిల్లా చిన్న ముప్పారం గ్రామానికి చెందిన జేత్ రాం గుండెపోటుతో మరణించారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ భగ్గు మంటున్నాయి. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం లేని సమస్యలను సృష్టించడంతోపాటు రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థుల విషయంలో అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ ఏడాదంతా పోరుబాట పట్టాలని బీజేపీ నిర్ణయించిందన్నారు. దీన్లో భాగంగా బర్నింగ్ ఇష్యూగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీసుల బదిలీల విషయంలో ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరును కొనసాగించాలని నిర్ణయించింది.
ఇది ఆరంభమే…. సర్కార్ దిగొచ్చేదాకా ఉద్యమిస్తాం: డాక్టర్ జి.మనోహర్ రెడ్డి
ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ‘జాగరణ’ ఒక తొలి అడుగు మాత్రమే. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని 317 జీవోను ఉపసంహరిస్తే సరేసరి. లేనిపక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యకు పరిష్కారం విషయంలో ప్రభుత్వం దిగొచ్చేదాకా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేయబోతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న తుగ్లక్ నిర్ణయాలతో ఉద్యోగులుసహా ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. ఈ ఏడాది పొడవునా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బండి సంజయ్ ఆధ్వర్యంలో పోరు బాట చేయబోతున్నాం. త్వరలోనే రాష్ట్ర నాయకత్వం కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Read Also: తెలంగాణ మరో ఘనత.. ఆ విషయంలో దేశంలోనే టాప్
ఉద్యోగులతో పెట్టుకున్నోళ్లెవరూ బాగపడలేదు: సీహెచ్.విఠల్
రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి భిన్నంగా 317 జీఓను రూపొందించారు. స్థానికత అంశాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం దారుణం. ప్రభుత్వ చర్యలవల్ల ప్రతి సగటు ఉద్యోగి బాధపడుతున్నరు. ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీసులంటే సీఎంకు ఎందుకింత కక్ష? వేలాది కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారు. వెంటనే జీవోను సవరించి స్థానికత ప్రాతిపదికన బదిలీలు చేపట్టాలి. లేనిపక్షంలో ఉద్యోగుల ఉసురు ప్రభుత్వానికి తగులుతుంది. ఉద్యోగాలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించిన దాఖలాలు చరిత్రలో లేవు. అందుకు చంద్రబాబు ప్రభుత్వమే ఉదాహరణ. కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆ బాటలోనే నడుస్తోంది. ఒకవైపు ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ….. అందుకు భిన్నంగా ఉద్యోగులపట్ల కక్ష సాధిస్తోంది. దీనికి నిరసనగా బండి సంజయ్ కుమార్ చేపట్టిన ‘జాగరణ’ దీక్షను రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యయ, పోలీసులు, వారి కుటుంబ సభ్యులు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం.
ఆ మూడింటిని పరిగణలోకి తీసుకోవాల్సిందే : మాజీ ఎమ్మెల్సీ, బి. మోహన్ రెడ్డి
317 జీవోను అమలు చేయడంవల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు ‘స్తానికత’ను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. లక్షలాది మంది ఉద్యోగులు నాన్ లోకల్ గా మారతారు. సీనియారిటీ ప్రాతిపదికన బదిలీలు చేస్తుండటంవల్ల అర్బన్ ప్రాంతాల్లో సీనియర్లంతా పనిచేస్తారు. జూనియర్ ఉద్యోగ, ఉపాధ్యాయులంతా మారుమూల ప్రాంతాలకు వెళ్తారు. దీంతో అర్బన్ ప్రాంతాల్లో రాబోయే కాలంలో ఖాళీలు ఏర్పడతాయి. మారుమూల ప్రాంతాల్లో దశాబ్దాల పాటు ఉద్యోగ ఖాళీలు ఏర్పడే పరిస్థితి లేదు. దీనివల్ల మారుమూల ప్రాంతాల నిరుద్యోగులు కూడా తీవ్రంగా నష్టపోతారు. తక్షణమే బదిలీలో ‘స్థానికత’ అంశాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. రెండు మెరిట్ కం రోస్టర్ విధానాన్ని అమలు చేసి అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా చూడాలి. అలాగే ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలి.