తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించారని.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఎక్కడ రక్తం చిందించలేదంటూ సెటైర్ వేశారు. కేసీఆర్ మూర్ఖత్వ పాలన నుంచి కాపాడేందుకు బీజేపీ కార్యకర్తలు రక్తం చిందించి జైల్లో శిక్షలు అనుభవించారని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాజీ మంత్రి కేటీఆర్ ను ఇప్పటికే జైల్లో పెట్టే వారమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also: Vamika Birthday: వామికా పుట్టిన రోజు.. వైరల్‌గా మారిన కోహ్లీ, అనుష్క వీడియో!
అనంతరం.. తీగల గుట్టపల్లి వద్ద రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను బండి సంజయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా తీగలగుట్టపల్లి ఆర్వోబీ పనుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని కోరారు. అధికారులు మాత్రం లేదంటూ నీళ్లు నమిలారు. మరోవైపు.. భూసేకరణ సమస్యను ప్రస్తావించిన ఆర్ అండ్ బీ అధికారులపై మండిపడ్డారు. ఇన్నాళ్లుగా ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదని బండి సంజయ్ నిలదీశారు. భూసేకరణ సాకుతో పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదని చెప్పారు. ఆర్వోబీ పనులు జరుగుతున్న చోట రోడ్లు కొట్టుకుపోయి దుమ్ము, ధూళితో జనం ఇబ్బందులు పడుతున్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డుకు తాత్కాలిక మరమ్మతు చేయాలని ఆదేశించారు.
Read Also: Mahesh Babu : మహేష్ బాబు ఎన్నిసార్లు సంక్రాంతి బరిలో గెలిచాడో తెలుసా?
మరోవైపు.. ఇక్కడకు ఆర్వోబీ కాంట్రాక్టర్ ఎందుకు రాలేదని బండి సంజయ్ మండిపడ్డారు. పనుల్లో నాణ్యత లోపిస్తున్నా.. ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం చేశారు. నిర్ణీత వ్యవధిలో ఆర్వోబీ పనులను పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. నాసిరకం పనులు చేస్తే కాంట్రాక్టర్ ను వదిలేపెట్టే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పారు. పనుల విషయంలో అధికారులు జవాబుదారీగా ఉండాల్సిందేనని వెల్లడించారు. ఆర్వోబీ నిధులన్నీ కేంద్రానివేననే సంగతిని గుర్తుంచుకోవాలని బండి సంజయ్ చెప్పారు.