MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్న కవిత, ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీ పదవిపై ఫిర్యాదు చేసే ముందే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని కూడా కవిత భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
PM Modi Funny Moment: దేనికి చప్పట్లు కొడుతున్నారంటూ.. నవ్వులు పూయించిన ప్రధాని..
ఇక మరోవైపు, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సొంత కూతురిపైనే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానుంది. గత కొంతకాలంగా కవిత తన సొంత పార్టీ, ఆ పార్టీ నేతలపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసిపోతుందనే సంచలన వ్యాఖ్యలు చేశారు. రజతోత్సవ సభ అనంతరం తన తండ్రి కేసీఆర్‌కు లేఖ రాస్తూ, ఆయన చుట్టూ “దెయ్యాలు” ఉన్నాయంటూ విమర్శలు గుప్పించారు. సీనియర్ నేత జగదీష్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
తాజాగా అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన కవిత, సీనియర్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై కూడా ఆరోపణలు చేయడంతో గులాబీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలతో కవిత.. బీఆర్ఎస్ మధ్య విభేదాలు మరింత బహిరంగమయ్యాయి. పార్టీని వదిలే దిశగా కవిత కదులుతుండగా, అధిష్టానం మాత్రం ముందే క్రమశిక్షణా కఠిన చర్యలు తీసుకుంది. దీంతో కవిత రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ మొదలైంది.