టీఆర్ఎస్ నేతల్లో అసహనం పెరుగుతోందా? అంటే అవుననే అంటున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన నేతలు కలిస్తే అది పెద్ద వార్త కాదు. కానీ వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు అసంతృప్తి నేతలు కలవడం రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన టీఆర్‌ఎస్ నేత జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును, ఖమ్మం లో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలవడం వెనుక ఏం జరుగుతుందనేది చర్చకు దారితీస్తోంది. ఉమ్మడి మహబూబ్‌గర్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఒకవైపు సాగుతుండగా ఆ జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఖమ్మం జిల్లాలో పర్యటించడం హాట్ టాపిక్ గా మారింది.
జూపల్లి కృష్ణారావు ముందుగా పాకాల గూడెంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గెస్ట్ హౌస్ కు వెళ్లి రెండు గంటల పాటు ఆయనతో వివిధ విషయాలు ముచ్చటించారు. అనంతరం తిరుగు ప్రయాణంలో ఖమ్మం మీదుగా వెళ్తుండగా ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిలో గంట సేపు సమావేశమయ్యారు . ఈ సమావేశంలో టీఆర్ఎస్ నేతలు మాజీ ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, డీసీసీబి మాజీ చైర్మన్ విజయబాబు ఉన్నారు . అయితే ఇది క్యాజువల్ గా మాత్రమే జరిగిందని కలవడానికి మాత్రమే జూపల్లి వచ్చాడని జిల్లా నేతలు అంటున్నారు . దీనికి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదని చెబుతున్నారు. కానీ మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సాగుతుండగా జూపల్లి కృష్ణారావు ఖమ్మం జిల్లాకు వచ్చి టీఆర్‌ఎస్ లో అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, ఇతర నేతలను వేరు వేరుగా కలవడం చర్చనీయాంశంగా మారింది.