ప్రధాని మోడీ తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పెనుదుమారం రేపుతున్నాయి. అయితే తాజాగా తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. మోడీ తెలంగాణకు పట్టిన శనిగ్రహం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ రూపంలో తెలంగాణను వెంటాడుతున్న భూతం అంటూ విమర్శించారు. కేసీఆర్ పథకాలతో ప్రధాని మోడీ వణికిపోతున్నారని, అందుకే పురిటీలోనే అణిచివేతకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిలువరించాల్సిన బాధ్యత యావత్ ప్రజానీకంపై ఉందని, అందుకు గులాబీ శ్రేణులు సన్నద్ధం కావాలన్నారు. తెలంగాణ 60 ఏండ్ల ఆకాంక్ష అని, అమరుల బలిదానలతో ఏర్పడ్డ కొత్త రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు.
36 పార్టీలను ఒప్పించి సాధించిన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని, బిల్లు పెట్టిన రోజున అద్వానీ, అరుణ్ జెట్లీ, సుష్మాస్వరాజ్ లు సభలోనే ఉన్నారని గుర్తు చేశారు. వారి సాక్షి గానే తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని, తెలంగాణా అంటే ప్రధానికి గుర్తుకొచ్చేదే ముఖ్యమంత్రి కేసీఆరేనని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధి ఢిల్లీకి సెగలు పుట్టిస్తున్నాయని, ఇక్కడి పథకాలపై ప్రజలు నిలదిస్తారన్న భయం మోడీకి పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే అసందర్బంగా నైనా తెలంగాణా పై అక్కసువెళ్లగక్కుతున్నారని విమర్శించారు. తెలంగాణ బీజేపీ నేతలకు ఏ, బీ, సీ, డీ, లు అంటే తెలియవని, 10 లక్షల మందికి కళ్యాణలక్ష్మీ/షాదీ ముబారక్ పథకాల కింద పేదలకు కట్నం ఇచ్చిన పార్టీ టీఆర్‌ఎస్ అని ఆయన అన్నారు.