రైతు పడించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే సేకరించాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ లోని లక్ష్మీ గార్డెన్స్ లో టీఆర్ఎస్ పార్టీ నల్గొండ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డి, జెడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహార భద్రత చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ దేశములో పండే ప్రతి వరి గింజను కొనాలని ఉంది. కానీ ఆ బాద్యత నుంచి కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే బీజేపీ , కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి తెలంగాణ రైతాంగం తో దోబూచులాడుతున్నారు. ఒకవైపు బీజేపీ పార్టీ గా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్టం అంత తిరిగి వరి ధాన్యం పండించాలని చెప్పాడు. మరో వైపు కేంద్ర మంత్రులు దాన్యం కొనలేమని రకరకాల పేర్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండే ప్రతి ధాన్యం గింజ కొనాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారన్నారు.
తెలంగాణ కోసం ఆనాడు ఉద్యమం చెసినట్లే, మరో ఉద్యమం చేసైనా తెలంగాణ రైతాంగం హక్కులు కాపాడతాం అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొద్దిమంది పెట్టుబడి దారులకు అనుకూలమైన చట్టాలు చేస్తూ..కోట్లాది మంది రైతాంగానికి ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ వైఖరి ని ఎండగడుతూ ఇంటింటికి తీసుకువెళ్లేందుకే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచైనా తెలంగాణలో పండే ధాన్యం కొనేలా చేస్తాం. రైతులకు అండగా నిలబడతాం అని స్పష్టం చేశారు.