Jagadish Reddy: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ నేత జగదీష్‌ రెడ్డి కౌంటర్‌

  • సీఎం వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఫైర్
  • రైతుల కోసం రక్తమిస్తామన్న జగదీశ్
  • నీటి నిర్వహణపై ప్రభుత్వాన్ని నిలదీత
  • రాజకీయాలు మాని రైతులను ఆదుకోవాలని డిమాండ్
Jagadish Reddy

Jagadish Reddy

Jagadish Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం తాము ప్రాణాలను పణంగా పెట్టి పోరాటంలోకి వచ్చామని గుర్తుచేసిన ఆయన, తమ రక్తంతో పంటలు పండుతాయని ప్రజలు భావిస్తే రైతుల కోసం రక్తం ఇవ్వడానికి కేసీఆర్‌తో పాటు తామంతా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావంతో కరువు వచ్చే ముప్పు ఉందని, నీటిని ఎత్తిపోయాలని తాము నెత్తీనోరూ బాదుకుంటున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినవన్నీ శుద్ధ అబద్ధాలని రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయిందని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలు పక్కనబెట్టి రైతులను ఆదుకోవాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద దాదాపు 10 టీఎంసీల నీరు వృధాగా పోతున్నా ప్రభుత్వం ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రశ్నించారు. గోదావరి ఉధృతికి భద్రాచలం కొట్టుకుపోతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, ఆయన మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల పొలాలకు నీళ్లివ్వడం చేతకాక, కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే విపక్షాలపై బురదజల్లుతోందని జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు.