Telangana Energy Minister Jagadish Reddy About Paddy Procurement.
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం వెనకబాటుకు గురైందని, బీజేపీ పాలనలో దేశం తిరోగమనం చెందుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధి జరిగిందని, దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణలో సాగుతున్న సుభిక్షమైన పాలనను దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నేడు అభివృద్ధి చెందిన దేశాల సరసన తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్ ను తెలంగాణకే పరిమితం చేయాలని బీజేపీ ఎన్నో కుట్రలు చేస్తున్నదని ఆయన మండిపడ్డారు.
తెలంగాణపై బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రంలో బీజేపీ అనేక రకాల మోసాలకు, ద్రోహలకు పాల్పడుతున్నదని ఆయన ఆరోపించారు. ఇవాళ పంజాబ్‌ను మించి అత్యధిక వరిని పండిస్తున్నది తెలంగాణ అని, వడ్లను కొనకుండా ఇబ్బందులు పెడుతుంది బీజేపీ అని ఆయన విమర్శించారు. సాకులు చూపి తెలంగాణ రైతులను నట్టేట ముంచేలా కేంద్రం వ్యవహరిస్తోందని, తెలంగాణ రైతుల పక్షాన టీఆర్‌ఎస్ ఎంతకైనా కొట్లాడుతుందని ఆయన స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి బీజేపీ మోసాలను ఎండగట్టాలని, రేపటి నుండి నియోజకవర్గలాల్లో ఎక్కడికక్కడ మీటింగ్‌లు పెట్టి రైతులను సంఘటితం చేసి, బీజేపీ దుష్ట పాలనను, వివక్షను ఎండగడతామన్నారు.