Indian Racing League Second Phase To Start From Dec 10: ఇండియన్ రేసింగ్ రెండో దశ పోటీలకు ఏర్పాట్లన్నీ సిద్ధం చేశామని ఇండియన్ రేసింగ్ లీగ్ చైర్మన్ అఖిలేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 10, 11న రేసింగ్ పోటీలు జరగనున్నాయని.. ఉదయం 10 గంటలకు ఈ లీగ్ ప్రారంభం కానుందని తెలిపారు. ఈ లీగ్‌లో 12 కార్లు, 6 జట్లు పాల్గొంటున్నాయని.. ట్రాక్‌పై రేస్ కార్లను 24 మంది డ్రైవర్లు నడిపించనున్నారని పేర్కొన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన అఖిలేష్ రెడ్డి.. గత అనుభవాల దృష్ట్యా ఈసారి పకడ్బందీగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని చెప్పారు. శనివారం ఉదయం 10 గంటలకు ప్రాక్టీస్ సెషన్, మధ్యాహ్నం క్వాలిఫై స్ప్రింట్ పోటీలు ఉంటాయన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఫైనల్ రేస్ నిర్వహించి, ఛాంపియన్‌ను ఇక్కడే ప్రకటిస్తామన్నారు.
పోయినసారి కంటే.. ఈసారి వీక్షకుల నిర్వహణ మరింత మెరుగ్గా ఉంటుందని అఖిలేష్ రెడ్డి తెలిపారు. వీక్షకుల భద్రత కోసం అనేక చర్యలు తీసుకున్నామన్నారు. గ్యాలరీతో పాటు స్టాండ్ల ఏర్పాటు పూర్తయ్యిందన్నారు. గతంలో హైదరాబాద్‌లో జరిగిన లీగ్ దశ విజయవంతం అయ్యిందని.. సమాచారలోపం కారణంగా గందరగోళం ఏర్పడిందని చెప్పారు. దాంతో వీక్షకులకు డబ్బులు వెనక్కు తిరిగి ఇచ్చేశామన్నారు. ఈసారి రేసింగ్ ప్యాట్రన్‌ను మార్చామని.. కేవలం ఇండియన్ రేసింగ్ లీగ్ మాత్రమే జరుగుతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. మరోవైపు.. ఎన్టీఆర్ మార్గ్‌లో ఈ లీగ్ జరగనున్న నేపథ్యంలో, ఆయా రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ ఇన్‌చార్జి అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 9వ తేదీ నుంచి ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లె్‌స్ రోడ్, లుంబినీ పార్క్‌లు మూసి ఉంటాయి.
కాగా.. గత నెలలో జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్‌లో కొన్ని అవాంతరాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే! ప్రసాద్ ఐమ్యాక్స్ ఎదుట ట్రాక్ మీదుగా వేగంగా వస్తున్న కారుపై చెట్టు కొమ్మ పడటంతో.. కారు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో నూర్ ఆలం అనే వ్యక్తి గాయపడ్డాడు. మరో ప్రమాదంలో కారు టైర్ విడిపోగా.. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఇక ఆదివారం నాడు మధ్యాహ్నం మరో ప్రమాదం చోటు చేసుకోగా.. చెన్నై టర్బో రైడర్స్ మహిళా రేసర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఇలా వరుస ప్రమాదాల కారణంగా.. ఫైనల్ పోటీలు నిర్వహించకుండానే ఈ రేసింగ్ లీగ్‌ను ఆపేయాల్సి వచ్చింది.