హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. సిటీలో శుక్రవారం రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయంగా మారిపోవడంతో.. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు.. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు.. ఇక, హైదరాబాద్‌లో రాత్రి 10 గంటల వరకు నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే.. అత్యధికంగా రామంతాపూర్‌లో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.. మాదాపూర్‌లో 4.1, హఫీజ్‌పేట్‌లో 3.6, చార్మినార్‌లో 2.8, సరూర్‌నగర్, ఎల్బీనగర్‌లో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.. మరోవైపు, హైదరాబాద్ సహా 14 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.. ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు రెడ్ అలెర్ట్ జారీ చేయడం ఇదే తొలిసారి.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. అంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.
Read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
రాగల రెండ్రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. గడిచిన 24గంటల్లో ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్, ఆ తరువాత రెండు రోజులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.. ఇక, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం కురిసింది.. శుక్రవారం రాత్రి వరకు భారీ వర్షం కొనసాగింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో 19.4 సెంటీమీటర్లు, మునగాలలో 9.75 సెం.మీ. వర్షపాతం నమోదైంది.. ఇక, ఇవాళ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.