దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో టీమ్ తెలంగాణ దూసుకుపోతోంది. వరుసగా పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. తాజాగా తెలంగాణలో రూ. 1400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు హ్యుండై సంస్థ ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్లో ఈ పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది. దీంతో పాటు తెలంగాణతో జట్టు కట్టేందుకు మాస్టర్స్ కార్డ్స్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మాస్టర్ కార్డ్స్ ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రోమాన్‌తో గురువారం కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిజటల్ స్టేట్ పార్ట్నర్షిప్ విషయంలో ఇరువురి మధ్య అవగాహాన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రజలకు అత్యంగ వేగంగా డిజిటల్ సేవలు అందివ్వడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుంది. రైతులు, మధ్య, చిన్నతరహా వ్యాపారాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు వేగవంతం కావడానికి ఇది ఉపకరిస్తుంది. అంతేకాదు.. సైబర్‌క్రైం, డిజిటల్ లిటరసీ విషయంలోనూ మాస్టర్‌కార్డ్స్ తెలంగాణతో కలిసి పని చేయనుంది.
మరోవైపు.. జీఎమ్ఎమ్ పీఫాడ్లర్ కూడా తన గ్లాస్-లైన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని విస్తరించేందుకు 10 మిలియన్ డాలర్ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇదివరకే ఈ సంస్థ 2020లో 6.3 మిలియన్ డాలర్లతో తెలంగాణలో పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు రెండేళ్ళ వ్యవధిలో రెట్టింపు పెట్టుబడి పెట్టేందుకు ఈ సంస్థ ముందుకు రావడం విశేషం.