తీవ్ర తల గాయాలు ప్రమాదాలను తగ్గించేందుకు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు అరేటే హాస్పిటల్స్ ఓ మంచి కార్యక్రమం చేపట్టింది. ‘వరల్డ్ హెడ్ ఇంజ్యూరీ డే’ అవగాహన దినోత్సవం సందర్భంగా “తల కోసం ముందుచూపు – హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు దక్కుతాయి” అనే సమాజహితం కార్యక్రమాన్ని నిర్వహించింది. రోడ్డు ప్రమాదాల కారణంగా జరిగే తల గాయాలను నివారించడానికి హెల్మెట్ ధరించడం అత్యంత ప్రభావవంతమైన ముందు జాగ్రత్త చర్యగా ఈ కార్యక్రమం దృష్టిని ఆకర్షించింది.
ఈ సందర్భంగా అరేటే హాస్పిటల్స్ న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ వై.. రామకృష్ణ చౌదరి మాట్లాడుతూ.. “రోడ్డు ప్రమాదాల వల్ల తలకు తీవ్ర గాయాలు అవుతాయి. అయితే.. హెల్మెట్ ధరించడం ద్వారా ఆ ప్రమాదాలను నివారించవచ్చు. అందుకోసం.. ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు తమ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.” అని సూచించారు. అందుకోసం.. ప్రచారంలో భాగంగా అరేటే హాస్పిటల్స్ తమ సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేసింది. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్విచక్ర వాహనదారులపై దృష్టి పెడుతుంది.
Read Also: Gachibowli Stadium: 200 మంది ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు ఆందోళన.. కారణమేంటంటే..?
అరేటే హాస్పిటల్స్ సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ రవీశ్ సుంకర మాట్లాడుతూ.. “రోడ్డు ప్రమాదాల కారణంగా జరిగే తల గాయాలు జీవితాన్ని మారుస్తాయి. ముఖ్యంగా.. బైకులపై వెళ్లే వారు, ప్రయాణికులు, మహిళలు, పిల్లలు, డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ లాంటి వారు ఎక్కువ ప్రమాదానికి గురవుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఎంతో ఉంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ గజరావు భూపాల్ ప్రత్యేక అతిథిగా పాల్గొని.. ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రతను ఎలా నిర్ధారించగలరో వివరించారు. “రోడ్డు ప్రమాదాలు నివారించడానికి హెల్మెట్ ధరించడం చట్టపరమైన నిబంధన మాత్రమే కాకుండా.. ప్రాణాలను కాపాడే మంచి అలవాటుగా మార్చుకోవాలి” అని ఆయన సూచించారు.
అరేటే హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ & క్రిటికల్ కేర్ హెడ్ డాక్టర్ పవన్ కుమార్.. “మా ఆసుపత్రి అత్యాధునిక సౌకర్యాలతో తల గాయాల చికిత్స చేయగలుగుతున్నా, అసలు గాయాలు జరగకుండా ఉండటమే మా ప్రాధాన్య లక్ష్యం. హెల్మెట్ ధరించడం అత్యంత అవసరం. ప్రజలంతా మంచి నాణ్యత గల హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలి” అన్నారు. అరేటే హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. “ప్రజాసేవలో మేమెప్పుడూ ముందుంటాం. ‘తల కోసం ముందుచూపు’ కార్యక్రమం రోడ్డు భద్రతపై ప్రజల్లో మార్పు తీసుకురావాలనే మా దృఢ నిశ్చయానికి నిదర్శనం. హెల్మెట్ ధరించకపోవడం వల్లే అనేక తల గాయాలు సంభవిస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అవగాహన కార్యక్రమాల ద్వారా తాము భద్రతా సంస్కృతిని ప్రోత్సహిస్తాము” అని చెప్పారు.