Bhatti Vikramarka: ప్రజాభవన్‌లో నిర్వహించిన టెలంగాణ ఎంపీల సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి పార్లమెంటు స్థాయిలో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం తొమ్మిదవ షెడ్యూల్లో సవరణ తప్పనిసరని పేర్కొన్నారు. ఈ అంశాన్ని రాబోయే పార్లమెంటు సమావేశాల్లో అడ్జర్న్‌మెంట్ మోషన్ లేదా క్వశ్చన్ అవర్ ద్వారా చర్చకు తీసుకురావాలని సూచించారు. అన్ని పార్టీల ఎంపీలు కలిసి ప్రధానమంత్రిని కలిసి వినతి పత్రం ఇవ్వాలి. ప్రధాని సమయం ఇస్తే, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఢిల్లీకి వెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నాం” అని భట్టి విక్రమార్క తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీలు అడిగిన సమాచారం గంటల్లో అందించేందుకు ఢిల్లీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు భట్టి తెలిపారు. నీటిపారుదల, విద్యుత్, జీఎస్టీ మరియు ఇతర కీలక రంగాలకు సంబంధించిన పెండింగ్ నిధులపై ఇప్పటికే కేంద్రానికి లేఖలు పంపినట్లు గుర్తు చేశారు. ఆ లేఖలు, సంబంధిత డాక్యుమెంట్లు ఎంపీలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
Read Also: India China Tensions: చైనా గూఢచర్యం.. క్షిపణి పరీక్ష షెడ్యూల్ మార్చిన భారత్!
మరోవైపు, 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చేందుకు అవసరమైన వనరులు, ప్రణాళికలు, అమలు రూపకల్పన రాష్ట్రం సిద్ధం చేసుకుంది అని భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా కేంద్ర మంత్రులు, ఎంపీలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఎంపీలకు ప్రపంచ స్థాయి సంస్థలు లేదా ప్రముఖులతో పరిచయాలు ఉంటే వివరాలు ఇవ్వండి. వారిని గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానిస్తాం” అని ఆయన అన్నారు. అయితే, రాజకీయాలు పక్కనపెట్టి — బీసీ రిజర్వేషన్లు, కేంద్ర నిధులు మరియు రాష్ట్ర అభివృద్ధి విషయాల్లో ఏకగ్రీవ పోరాటం చేయాల్సిన సమయం ఇదే అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా పార్లమెంట్ సభ్యులు అందరూ పార్టీలకు అతీతంగా ఒక బృందంగా ఏర్పడి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను విజ్ఞప్తులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారని ప్రజాభవన్ లో ఎంపీల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు..