Site icon NTV Telugu

Congress Meeting: నేడు సీఎం రేవంత్ తో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్ భేటీ..

Revanth

Revanth

Congress Meeting: తెలంగాణ కాంగ్రెస్‌లో నేడు ( అక్టోబర్ 7న) కీలక పరిణామాలు చోటు చేసుకోనుంది. ముఖ్యంగా, బీసీ నేతల అత్యవసర సమావేశం ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు జరగనుంది. రేపు ( అక్టోబర్ 8న) హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు రానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్‌పై రేపు వాదనలు జరగనున్న నేపథ్యంలో.. ఈ భేటీలో పార్టీ తరఫున తీసుకోవాల్సిన నిర్ణయాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యమైన బీసీ నాయకులు పాల్గొనే అవకాశం ఉంది.

Read Also: Israel-Hamas: ఇజ్రాయెల్-హమాస్ శాంతి చర్చల్లో పురోగతి.. ఈజిప్టు చర్చలు ఫలించినట్లు సమాచారం!

మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈరోజు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు. వీరి సమావేశంలో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ బైపోల్ కు సంబంధించిన అభ్యర్థి ఎంపిక, సమర్థవంతమైన ప్రచార వ్యూహం లాంటి కీలక అంశాలపై నేతలు డిస్కస్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సమావేశంలోనే పార్టీ తలపెట్టిన మరో ముఖ్య కార్యక్రమం ‘బస్తీ బాట’ నిర్వహణ తేదీలను కూడా కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయ కార్యకలాపాలు మరింత స్పీడ్ కానున్నాయి.

Exit mobile version