Sankranti Special Trains: సంక్రాంతి పండుగ అంటే చాలు.. తెలుగువారంతా సొంత ఊళ్లకు బయలుదేరుతారు.. సిటీలు వదిలి పల్లెకు ప్రయాణం అవుతారు.. దీంతో, బస్సులు, రైళ్లు, విమానాలు ఇలా ఎక్కడ చూసినా రద్దీ ఏర్పడుతుంది.. అంతేకాదు.. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లే రోడ్లు సైతం వాహనాలతో కిక్కిరిసిపోతాయి.. అయితే, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, అవసరాన్ని బట్టి ఈ సీజన్ మొత్తంలో జంట నగరాల నుంచి సుమారు 600 వరకు ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ పేర్కొన్నారు..
Read Also: Putin: పుతిన్ సమక్షంలోనే స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన జర్నలిస్ట్.. వీడియో వైరల్
ఈ ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్, చర్లపల్లి, లింగంపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి నడవనున్నాయని వెల్లడించారు శ్రీధర్… సంక్రాంతి ప్రయాణానికి నెల రోజుల ముందుగానే ప్రత్యేక రైళ్లను ప్రకటించినట్లు తెలిపారు. అయితే, ముందస్తు బుకింగ్ల కారణంగా రిజర్వేషన్లు ఇప్పటికే వేగంగా నిండిపోతున్నాయని చెప్పారు. వెయిటింగ్ లిస్ట్ పరిస్థితిని బట్టి మరిన్ని ప్రత్యేక రైళ్లు ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళం, తిరుపతి మార్గాల్లో ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ ఉందని సీపీఆర్వో వెల్లడించారు. జనవరి 24వ తేదీ వరకు 400కు పైగా ప్రత్యేక రైళ్లు నడిపేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈసారి హైదరాబాద్ నుంచి రైళ్ల ద్వారా 30 లక్షల మందికిపైగా ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేశారు ఇక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భద్రతా, సౌకర్య చర్యలు తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. ప్రత్యేక రైళ్లలో అదనపు చార్జీలు వర్తిస్తాయని కూడా దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.