తెలంగాణలో మరోసారి ఎన్నికల హడావుడి మొదలైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఎమ్మెల్యే కోటా ఐదు ఎమ్మెల్సీ స్ధానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఈ నెల 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. ఈనెల 20వ తేదీన పోలింగ్‌జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలుచుకునే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Zelensey: మరోసారి ట్రంప్‌తో భేటీపై జెలెన్‌స్కీ కీలక ప్రకటన
ఇదిలా ఉంటే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ను అధికారులు ఓపెన్ చేశారు. ముందుగా బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టనున్నారు. ఈ ప్రక్రియ దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందని.. అసలు కౌంటింగ్ ప్రక్రియ ఆ తర్వాత మొదలు కానుందని అధికారులు చెప్పారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడి కానున్నాయి. అయితే పట్టుభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి మాత్రం 2, 3 రోజుల సమయం పట్టే అవకాశముంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
ఏపీ, తెలంగాణలో ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి.. తెలంగాణలో 2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 70 మంది అభ్యర్థులు, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 90 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ 6 ఎమ్మెల్సీ స్థానాలకు నేడు లెక్కింపు జరుగుతోంది. చెల్లుబాటు అయిన ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం సహా ఉపాధ్యాయ నియోజకవర్గానికి కరీంనగర్‌లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో.. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి నల్గొండలోని వేర్‌హౌసింగ్ గోదాములో కౌంటింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో.. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానిది ఏలూరులోని వట్లూరు సీఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు గుంటూరు ఏసీ కాలేజీలో కొనసాగుతోంది.