Maoist Party: వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో దాడి ఘటనపై మావోయిస్టులు సంచలన లేఖ విడుదల చేశారు. అందులో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వసం, అప్రజాస్వామిక పాలన కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనో బాధ్యత రాహిత్యం వలనో జరుగుతున్నది కాదు అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా కమీషన్ల కోసం కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించింది. అందులో భాగమే ఈ ప్రజా ఉద్యమాలు, ప్రజల తిరుగుబాటు అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక, కొడంగల్ లో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ప్రజలు చేసిన తిరుగుబాటును, రైతుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు రాజకీయ కుట్రగా చిత్రీకరించే ప్రయత్నం పాలక వర్గాలు చేస్తున్నాయని వెల్లడించింది.
Read Also: Virat-Anushka: ఆస్ట్రేలియాలో చిల్డ్రన్స్ డే వేడుకలు జరుపుకున్న విరాట్-అనుష్క..
ప్రజలారా, తెలంగాణ బుద్ధిజీవులారా, మేధావులారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక అప్రజాస్వామిక పాశవిక పాలనను ఖండించండి అని మావోయిస్టుల ఆ లేఖలో ప్రస్తావించారు. అక్రమ కట్టడాలు, మూసీ నది ప్రక్షాళన పేర్లతో మధ్య తరగతి, పేద ప్రజలపై హైడ్రా కొనసాగిస్తున్న అనాగరిక బుల్డోజర్ దాడులను వ్యతిరేకించండి అని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని విధ్వసం చేస్తున్నా.. నేవి రాడార్ స్టేషన్ ను, కొడంగల్ ఫార్మా సిటీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేపట్టండి అంటూ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.