Fatehnagar Flyover: కనీస మెయింటెనెన్స్ లేక ఫతే నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పెచ్చులూడుతుంది. బాలానగర్ నుంచి బల్కంపేట, సనత్ నగర్ వెళ్ళేందుకు నిర్మించిన ఫతే నగర్ బ్రిడ్జి.. రద్దీ ప్రదేశం కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు పూర్తి రద్దీతో ఉంటుంది. ఫతే నగర్ నుంచి సనత్ నగర్ బస్ స్టాప్ కి పాదచారులు వెళ్ళడానికి ఫ్లై ఓవర్ కి అనుకుని మెట్ల మార్గం సైతం ఏర్పాటు చేశారు. అయితే, మెట్ల మార్గం పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. నిన్న ఈ మెట్ల మార్గంలో కిందికి దిగుతుండగా మెట్లు కూలి ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఏ క్షణమైన పూర్తిగా ఈ మెట్లు కూలిపోయే అవకాశం ఉందనే సమాచారంతో.. ఆ మెట్ల మార్గాన్ని చేసిన హైడ్రా అధికారులు నేల మట్టం చేశారు.
Read Also: Asaduddin Owaisi : “నకల్ కర్నేకే లియే అకల్ చాహియే” అంటూ పాక్‌పై ఎద్దేవా
అయితే, బ్రిడ్జి కూడా కూలితే పెను ప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తి చేశారని స్థానిక ప్రజా ప్రతినిధులు అంటున్నారు. ప్రభుత్వం మారడంతో కొత్త బ్రిడ్జి పనుల ప్రారంభానికి ఆటంకంగా మారాయని లోకల్ ప్రజలు ఆరోపిస్తున్నారు. వెంటనే నిధులు విడుదల చేసి కొత్త బ్రిడ్జి నిర్మాణానికి పనులు ప్రారంభించాలని బల్దియా అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.