RV Karnan: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ సజావుగా జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ ఈరోజు ఎర్రగడ్డలోని పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అయితే, పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న క్రమంలో, పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్న ఏజెంట్లకు సరైన గుర్తింపు కార్డులు లేకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏజెంట్లు తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ జారీ చేసిన గుర్తింపు కార్డులను ధరించాలని, నిబంధనలను ఉల్లంఘించవద్దని స్పష్టం చేశారు. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆర్వీ కర్ణన్ ఆదేశించారు.
Read Also: Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ గా టీవీ నటి, యాంకర్
ఇక, పోలింగ్ కేంద్రంలో తనిఖీ తర్వాత ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఎన్టీవీతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఏదైనా చిన్నపాటి సాంకేతిక సమస్యలు తలెత్తినా, వాటిని వెంటనే పరిష్కరించడానికి తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు. ఇక, అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ భద్రతను పటిష్టం చేసినట్లు వెల్లడించారు. ఇక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం గతంలో కంటే 40 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.