NTV Telugu Site icon

K. Laxman: కులగణన ఓ తప్పుల తడక

Klaxman

Klaxman

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన మీద ప్రవేశపెట్టిన నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఢిల్లీలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ‘‘ కులగణన అసమగ్రంగా, అశాస్త్రీయంగా ఉంది. ఈ నివేదిక వాస్తవాలకు దూరంగా ఉంది.నిజంగా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే.. చట్టరూపంలో తీసుకొచ్చి అమలు చేసేందుకు అందులో ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్ది బిల్లు రూపంలో తీసుకురావాల్సింది. మొక్కుబడిగా, తూతూమంత్రంగా చేశారు. ఓబీసీల పట్ల కపటప్రేమను ఒలకబోస్తున్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా.. సర్వేలో బీసీల శాతాన్ని తగ్గించి చూపించారు. బీసీలను రాజకీయంగా అణచివేసేందుకు వేసిన చర్యగానే దీన్ని భావించాలి. ఇది కాంగ్రెస్ మానసిక ఆలోచనకు అద్దం పడుతోంది. రాజ్యాంగ విరుద్ధమైన పదాలు వాడారు. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని పేర్కొన్నారు. మండల్ కమిషన్ లోనూ 51శాతం, బీఆర్ఎస్ సమగ్రకుటుంబ సర్వేలోనూ.. 52 శాతం బీసీలున్నారని వెల్లడైంది. మరి ఈ సంఖ్య ఎలా 46 శాతానికి వచ్చింది. 4 కోట్ల జనాభాలో దాదాపు 6 శాతం తగ్గుదల బీసీలకు చేస్తున్న ద్రోహానికి అద్దం పడుతోంది. 12 శాతం ముస్లింల జనాభాను చూపిస్తూ.. 2 శాతం ముస్లిం బీసీలు, ముస్లిం ఓసీలు అని చూపించడం దేనికి నిదర్శనం.’’ అని లక్ష్మణ్ ప్రశ్నించారు.

‘‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారు.. మతపరమైన రిజర్వేషన్లు ఉండవని చెప్పినా.. వీళ్లు మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు. కానీ దాన్ని ఏనాడూ తెరిచి చూడలేదని అర్థమవుతోంది. ముస్లింలను సంతుష్టి పరిచేందుకు బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నం. బీసీల హక్కును ముస్లింలకు కట్టబెట్టే ప్రయత్నం. రాహుల్ గాంధీ సమక్షంలో గతేడాది నవంబర్ 6న ఈ సర్వేను ప్రారంభించారు. ఈ సర్వే దేశానికి ఓ రోల్ మాడల్ అని చెప్పారు. బీసీల ఓట్లను తగ్గించి ముస్లింలకు కట్టబెట్టడమే రోల్ మోడలా?, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 150 సీట్లలో 50 సీట్లు బీసీలకు రిజర్వ్ చేస్తే.. ఇందులో 18 మాత్రమే బీసీలకు ఇచ్చి మిగిలినవి ముస్లింలకు కట్టబెట్టడం అత్యంత దారుణం. 32 బీసీ సీట్లలో ముస్లింలుగా గెలిచారు. సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుగుణంగా 50 శాతంలోపే రిజర్వేషన్లు ఉండాలి. సీఎంగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు.. ముస్లింలకు సంబంధించిన 14 కులాలను బీసీలుగా పరిగణిస్తూ.. బీసీలకు దక్కాల్సిన వాటాను ముస్లింలకు కట్టబెట్టారు. ఇదేం కొత్తకాదు. సోనియా గాంధీ నిర్ణయం తీసుకుని దేశవ్యాప్తంగా 27 శాతం బీసీ రిజర్వేషన్లలో 4 శాతం తొలగించి ముస్లింలకు ఇస్తే కోర్టు కొట్టేసింది. మండల్ కమిషన్ స్పష్టంగా.. 1990లో ముస్లింలలోని రెండు తెగలు (దూదేకుల, మెహతర్)ను బీసీల్లో రిజర్వేషన్లు పొందుతున్నారు. దీన్ని రాజశేఖర్ రెడ్డి 4 శాతం కోసం ప్రయత్నిస్తే.. కేసీఆర్ ఏకంగా 12 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తామని చెప్పారు. ఇదంతా బీసీల ఓట్లను, బీసీల రిజర్వేషన్లను తగ్గించేందుకు జరిగిన కుట్ర. రేవంత్ రెడ్డి ఏకంగా.. ఎన్నికల ముందు రిజర్వేషన్లలో బీసీలకు న్యాయం చేస్తానని చెప్పి ఇవాళ తూతూమంత్రంగా నివేదికను సమర్పించి చేతులు దులుపుకునే ప్రయత్నం ఇది.’’ అని లక్ష్మణ్ ధ్వజమెత్తారు.

‘‘పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బీసీల జనాభా పెరగాలని కానీ.. ఇవాళ కోటి 60 లక్షల మందే ఉన్నారని చెప్పడం నమ్మశక్యం కాని విషయం. 342‑ఏ చట్టం ప్రకారం .. రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆ రాష్ట్రాలు బీసీల స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని బీసీల రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. కానీ అలా చేయడం లేదు. కానీ మోడీ ప్రభుత్వం బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించి బీసీలకు సరైన గౌరవం కల్పించింది. జామియా ఇలిమియా వంటి వర్సిటీలకు మైనారిటీ స్టేటస్ ఇచ్చి.. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు ఎత్తేశారు.
దేశవ్యాప్తంగా 9వేలకు పైగా విద్యాసంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను ఎత్తేశారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో దీని గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. కాకా కాలేకర్ కమిషన్ ఏర్పాటు చేస్తే.. దాన్ని నెహ్రూ గారు ఎలా తొక్కిపెట్టారో జనాలకు తెలియదా?, చివరకు అంబేడ్కర్ గారు రాజీనామా చేస్తానని చెబితే.. నెహ్రూ వెనక్కు తగ్గారు. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని అంబేడ్కర్ కోరితే.. దాన్ని నెహ్రూ గారు అమలు చేయకుండా ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. మండల్ కమిషన్ నివేదికపైనా.. చర్చ లేకుండా పక్కనపెట్టారు. దీనిపై నాటి ప్రధాని వీపీ సింగ్ గారు చర్చకు పెడితే.. ప్రతిపక్ష నాయకుడిగా రాజీవ్ గాంధీ.. ప్రధాని వీపీ సింగ్ గారిపై తీవ్ర విమర్శలు చేశారు. మీరు చేస్తున్న కుట్రల్లో బీసీలు భాగం కారు. మీ మాటలు బీసీలు నమ్మరు. ఆరు గ్యారంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేశారు. అలాగే ఇప్పుడు బీసీలను మోసం చేస్తున్నారు. ఏడాదికి 20వేల చొప్పున ఐదేళ్లలో లక్షకోట్లు ఇస్తామని చెప్పి.. గత బడ్జెట్‌లో ఎంత కేటాయించారు?, కులాల పేరుతో ఏర్పడిన కార్పొరేషన్లకు ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు ఇవ్వలేదు. మోడీ బీసీల సంక్షేమం కోసం.. బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత ఇచ్చారు. నీట్ పరీక్షల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఉన్నత విద్యాసంస్థల్లోనూ ఈ రిజర్వేషన్ల కారణంగా.. గత పదేళ్లుగా బీసీలు నాణ్యమైన ఉన్నతవిద్యకు నోచుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పంథాను అనుసరిస్తున్నారు. దాదాపు 90 శాతం ముస్లింలు బీసీలు అని చెప్పడం సిగ్గుచేటు. మండల్ కమిషన్ రెండు తెగలను మాత్రమే బీసీలను అని చెబితే.. మీరు దీన్ని 90 శాతానికి పెంచడం దుర్మార్గం. కుట్రపూరితం. మీకు బీసీల పట్ల ఏమాత్రం ప్రేమలేదు. నెహ్రూ కుటుంబ ఎజెండాలో రేవంత్ రెడ్డి భాగమయ్యారు.’’ అని లక్ష్మణ్ పేర్కొన్నారు.

‘‘నిజంగా రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే.. మీ ప్రసంగంలో చెప్పినట్లుగా.. తెలంగాణలో 90 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలుగా ఉన్నప్పుడు.. ఆయా వర్గాలకు మీరు ఎన్ని పదవులు ఇస్తున్నారు. రేవంత్ కేబినెట్‌లోని మంత్రులు.. నోరు విప్పాలి. బయటకు రావాలి. కేసీఆర్ ఒక్కరోజుల్లో తడిగుడ్డతో గొంతు కోస్తే.. రేవంత్ 50 రోజుల పాటూ రోజూ పొడిచి పొడిచి చంపారు. బీసీ గణన విషయంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం బీసీల్లో ఉంటుంది. అందుకే రాష్ట్రాలు సర్వే చేసి కరెక్ట్ వివరాలు సమర్పిస్తే మేం స్వాగతిస్తాం. బీహార్‌లో మేం నిష్పక్షపాతంగా చేశాం. కానీ సిద్దరామయ్య సర్వే చేసి.. ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. బీఆర్ఎస్ పార్టీకి.. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ముస్లింల రిజర్వేషన్లను 12 శాతం పెంచుతామని చెప్పి.. బీసీల గొంతు కోసిన మాట నిజం కాదా?, మధ్యప్రదేశ్ లో శివరాజ్ చౌహాన్ సర్వే చేసి బీసీలకు న్యాయబద్ధంగా సీట్లు ఇచ్చారు. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ బీసీలకు తగ్గించిన సీట్లపై పోరాడి.. కోర్టులో పోరాడి దాని ఆధారంగా బీసీలకు సీట్లు ఇచ్చారు. బీసీ పాలసీ విషయంలో బీజేపీ సామాజిక చిత్తశుద్ధితో పనిచేశాం. ఇకపైనా ఇదే విధానంలో ముందుకెళ్తాం.’’ అని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.