All Political Parties Preparing for Elections.
తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ వ్యూహ రచన చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు మైకుల ముందు మేమంటే మేము అంటూ.. మైకుల పగిలేలా స్పీచులు ఇచ్చిన నేతలు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. ప్రత్యర్థులకు ఆలోచనలకు అందకుండా వ్యూహాలు రచించేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు ఇతర పార్టీలు ఉన్నా.. తారాస్థాయి పోరుమాత్రం కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్యనే ఉండబోతోంది. ఇటీవల చేసిన కొన్ని సర్వేల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు మాత్రమే పోటీ ఉంటుందని, బీజేపీకి మూడో స్థానంలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఆయా రాజకీయ పార్టీలు తమ నమ్మకమైన సంస్థలతో సర్వేలు చేయించుకుంటున్నాయి. సర్వేల్లో వచ్చిన ఫలితాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ.. తమతమ పార్టీల బలోపేతానికి కృషి చేసే ఆలోచనల పడ్డారు అగ్రనేతలు.
ఇప్పటికే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగేందుకు ఎమ్యెల్యేలందరూ తమతమ నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకం కావాలని సూచించారు. అంతేకాకుండా ప్రజక్షేత్రంలో గెలిచినవారికే పట్టం కడుతామని చెప్పకనే చెప్పారు కూడా. ఇదిలా ఉంటే… బీజేపీ నేతలు సైతం తమ సర్వే ఫలితాల్లో పార్టీ ఏ చోట బలహీనంగా ఉంది.. ప్రజలు దృష్టిని ఆకర్షించేందుకు వేయాల్సిన ఎత్తుగడలేంటని కసరత్తు మొదలెట్టారు. ఇక కాంగ్రెస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరినట్లైంది. ఎందుకంటే.. ఇటీవల వెలువడిన కొన్ని సర్వే ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయంగా నిలిచింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకమైన నాటి నుంచి తనదైన శైలిలో ముందుకు పోతున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి అధ్యక్ష పదవిని చేతబూని.. అంపశయమీద ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌కు ఊపిరి పోశారని రాజకీయ విశ్లేషకులు అప్పుడే చెప్పారు.
అయితే టీపీసీసీ అధ్యక్ష పీఠం కోసం ఆశించి భంగపడ్డ నేతలు, రేవంత్ రెడ్డి అధ్యక్షతను ఒకపట్టాన ఒప్పుకోలేదు.. ఇప్పుడిప్పుడే అందరినీ కలుపుకోని వెళ్తున్నట్లు ఉన్న రేవంత్ రెడ్డికి.. ఇటీవల సీనియర్ల సమావేశం తలనొప్పిని తీసుకువచ్చింది. సర్వేల్లో చూస్తే.. కాంగ్రెస్‌పై ప్రజల్లో నమ్మకం ఉంది.. కానీ.. పార్టీ నేతల్లోనే స్పష్టత కొరవడడంతో.. ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు పోతాయనే భావన కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది. తమ పార్టీలో నెలకొన్న పరిస్థితిని బయటకు రానివ్వకుండా.. కాంగ్రెస్ వ్యూహకర్తలు లోలోపడే అసంతృప్తి సెగలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా.. ఎన్నికల నాటికి సిద్ధమయ్యేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. చివరికి గెలుపెవరిదో చూడాలి..