Hyderabad Sultan Nagar Gully Leader Warns Traffic CI: హైదరాబాదులోనిలో సుల్తాన్ నగర్‌లో ఒక గల్లీ నాయకుడు వీరంగం సృష్టించాడు. తన జోలికొస్తే తరిమేస్తానంటూ హెచ్చరించాడు. ఇంతకుముందు తనతో పెట్టుకున్న ఒక మహిళ ట్రాఫిక్ సీఐని కూడా తాను ట్రాన్స్‌ఫర్ చేయించానని, నీకూ అదే గతి పడుతుందంటూ రెచ్చిపోయాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
సుల్తాన్ నగర్ నిత్యం రద్దీగా ఉంటుంది. అక్కడ రోడ్ల పక్కనే చిరు వ్యాపారస్తులు తమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల వాహనాలు వెళ్లే దారిలో రాకపోకులకు అంతరాయం కలుగుతోంది. దీంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ సీఐ ధనలక్ష్మి.. వ్యాపారస్తుల్ని పిలిపించి, వాహనాలకు ఆటంకం కలగకుండా వ్యాపారాలు చేసుకోమని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న గల్లీ నాయకుడు.. సీఐ వద్దకు వచ్చి, మహిళా అధికారి అని చూడకుండా వీరంగం సృష్టించాడు. తాము ఇదే తరహాలో వ్యాపారం చేసుకుంటామని, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ రెచ్చిపోయాడు. ‘‘నీలాగే గతంలో పద్మ అనే మహిళ ట్రాఫిక్ సీఐ ఉద్యోగం చేసేది. నీలాగే నాతో పెట్టుకుంది, నా జోలికి వచ్చింది. 20 రోజుల క్రితమే ఇక్కడి నుంచి తరిమేశాను’’ అంటూ హంగామా సృష్టించి, వెళ్లిపోయాడు.
ఈ నేపథ్యంలోనే.. రాజకీయ అండదండలతో పోలీసుల్ని భయబ్రాంతులకు గురి చేస్తోన్న ఇలాంటి గల్లీ నాయకులపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, చర్యలు తీసుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే.. వీధికొక నాయకుడు తయారవుతారని అంటున్నారు. ఇప్పటికైనా.. అధికారుల్ని ఇబ్బంది పెడుతున్న, విధులకు ఆటంకం కలిగిస్తున్న ఇలాంటి చోటామోటా నాయకులపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.