Mclaren 765 LT: గత ఐదేళ్లలో భారతీయ మార్కెట్‌లో ఇతర దేశాల కార్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. లంబోర్ఘిని, ఆస్టన్, ఫెరారీ వంటి బ్రాండ్‌లు తమ కార్లను మన దేశంలో విక్రయాలు చేస్తున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా మెక్‌లారెన్ ప్రవేశించింది. ఈ బ్రాండ్ ఏడాది క్రితం భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇటీవల ముంబైలో తమ మొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా ఈ బ్రాండ్ తన ఫ్లాగ్‌షిప్ సూపర్‌కార్ మెక్‌లారెన్ 765 LTని ఆవిష్కరించింది. ఇది భారతదేశంలో అధికారికంగా అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన సూపర్ కార్లలో ఒకటి. మెక్‌లారెన్ ఇప్పటికే తన మొదటి కస్టమర్‌కు కారును డెలివరీ చేసింది. ఇండియాలోనే అత్యంత ఖరీదైన ఈ కారును ఇటీవల హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త నసీర్ ఖాన్ కొనుగోలు చేశారు.
Read Also: IND Vs BAN: వన్డే సిరీస్ పోయింది.. టెస్ట్ సిరీస్ అయినా పట్టేస్తారా?
అయితే ఈ కారు ఖచ్చితమైన ధర తెలియనప్పటికీ.. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.12 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. మెక్‌లారెన్ 765 LT ఉత్పత్తి 765 యూనిట్లకు పరిమితం చేయబడింది. ఇది భారతదేశంలోని ఇతర సూపర్‌కార్ల కంటే మరింత ప్రత్యేకమైనది. ఈ కారు 4.0 లీటర్ ట్విన్-టర్బోచార్జుడ్ V8 పెట్రోల్ ఇంజిన్‌తో తయారుచేయబడింది. వాస్తవానికి మెక్‌లారెన్ వంటి సూపర్‌కార్‌ను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఔత్సాహికులు ఆసక్తి చూపి ఈ కార్లను భారతదేశానికి దిగుమతి చేసుకున్నారు. అయితే ఈ బ్రాండ్‌కు చెందిన తొలి సూపర్ కారు భారత్‌లో హైదరాబాద్ వాసి నసీర్ ఖాన్‌కు డెలివరీ చేయబడింది. నసీర్ ఖాన్ విషయానికి వస్తే ఇప్పటికే ఆయన ఎన్నో ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు. మెక్‌లారెన్ 765 LT స్పైడర్ అతని మొదటి సూపర్ కార్ కాదు. అతని గ్యారేజీలో రోల్స్ రాయిస్, ఫెరారీ, మెర్సీడీస్ బెంజ్, లంబోర్ఘిని, వంటి ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి.