దేశంలో అత్యధిక మంది కోటీశ్వరులు ఉన్న నగరాల్లో మన హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. దేశంలో కోటీశ్వరుల విషయంలో దిగ్గజ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్ సర్వే చేసింది. ఈ జాబితాలో ముంబై తొలి స్థానంలో నిలిచింది. ఫార్మా, బయోటెక్ రంగాలతో పాటు ఐటీ రంగానికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరంలో కోటీశ్వరులు సంపదను వెనకేసుకోవడంలో దూసుకుపోతున్నారు. దాదాపు రూ.220 కోట్ల సంపద ఉన్నవాళ్లు హైదరాబాద్ నగరంలో 467 మంది ఉన్నారని నైట్ ఫ్రాంక్ సర్వే వెల్లడించింది. హైదరాబాద్ కంటే ముందు నిలిచిన ముంబైలో వీరి సంఖ్య 1,596గా నమోదైనట్లు తెలిపింది.
కోటీశ్వరుల విషయంలో ముంబైతో పోలిస్తే హైదరాబాద్‌లో సగానికంటే తక్కువగానే ఉన్నారు. అయినప్పటికీ హైదరాబాద్ నగరంలో వేగంగా కుబేరులు వృద్ధి చెందుతున్నట్లు సర్వే గుర్తించింది. హైదరాబాద్ తర్వాత పుణె, బెంగళరు, కోల్‌కతా, ఢిల్లీలో ఎక్కువ మంది బిలీయనీర్లు ఉన్నారు. గత ఐదేళ్లలో ఢిల్లీలో కోటీశ్వరుల శాతం 101.2 శాతం పెరగగా.. ముంబైలో 42.6 శాతం, బెంగళూరులో 22.7 శాతం పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది. వచ్చే ఐదేళ్లలో బెంగళూరులో వీరి సంఖ్య 89 శాతం పెరిగి 665కు చేరుకోవచ్చని నైట్‌ఫ్రాంక్ అంచనా వేసింది.