హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను గురువారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర విభజనపై ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం టీఆర్ఎస్ కార్యకర్తలు చేపట్టిన నిరసనల్లో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మోదీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జనగామలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులకు నిరసనగా జనగామలో గురువారం బీజేపీ మౌనదీక్షకు పిలుపునిచ్చింది. అయితే టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జనగామ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈటల రాజేందర్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని… నిరసనలు, బంద్‌లు చేసేందుకు టీఆర్ఎస్ పార్టీకీ మాత్రమే అనుమతిస్తారా అంటూ పోలీసులపై ఆయన మండిపడ్డారు. దాడులు చేసిన వారి పక్షాన పోలీసులు నిలుస్తారా అని నిలదీశారు. ఇది ఎక్కువ కాలం చెల్లదని ఈటల హెచ్చరించారు.