తెలంగాణలో సూరీడు చుర్రుమంటున్నాడు. సాధారణంగా ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎండ వేడిమి పెరుగుతుంది. కానీ ఈసారి ఒక నెలముందుగానే ఎండలు పెరిగిపోయాయి. దీంతో బయటకు రావాలంటేనే జనం హడలిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదవుతున్నాయి. కొమురం భీం జిల్లా కెరమెరిలో 43.9 గా గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు కాగా వాంకిడిలో 43.8 గా నమోదు అయ్యాయి.
అలాగే ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ లో 43.2 గా నమోదయ్యాయి. బోరాజ్ లో 43 డిగ్రీలు కాగా .బేలా మండలం చేప్రాలలో 42.7 గా నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక నిర్మల్ జిల్లా నర్సాపూర్ లో 42.7 గా నమోదు కాగా మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 42.1 గా గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటినప్పటినుంచీ ఎండల తీవ్రత పెరుగుతోంది.
తెలంగాణలో అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. మే నెలలో ఎండలు విపరీతంగా ఉంటాయని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీచేసింది. ఎండలు పెరుగుతుండడంతో చిన్న పిల్లలు, వృద్ధులు ఎండలకు బయటకు వెళ్లకుండా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. వడదెబ్బతో పాటు డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంతగా ఎక్కువగా నీటిని తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.