తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. తెల్లవారు జామునే కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఎడతెరిపి లేని వాన కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అయితే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అర్థరాత్రి ఏకదాటిగా భారీ వర్షం కురిసింది.
జగిత్యాల, కోరుట్ల, హుజురాబాద్, జమ్మికుంటలో వర్షం ప్రభావంతో కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం కొట్టుకపోయింది. కొన్ని చోట్ల టార్ఫిన్లు లేక వరి ధాన్యం తడిసి ముద్దైంది. అంతేకాకుండా.. అకాల వర్షం కారణంగా మామిడికాయలు నేల రాలడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 76.5 మిల్లిమీట్లర వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో 37.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.