తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు పూర్తిగా రాష్ట్రంలో విస్తరించడంతో అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. విదర్భ ప్రాంతలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 4న రాత్రి నుంచి భారీ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
మంచిర్యాల, జగిత్యాల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్- మల్కాజ్ గిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణ పేటలో సాధారణ వర్షాలు నమోదు అవుతాయని..నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ జిల్లాల్లో తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Read Also: Bihar: కూతురును చంపించేందుకు మాజీ ఎమ్మెల్యే ప్లాన్.. కాంట్రాక్ట్ కిల్లర్ తో ఒప్పందం
గడిచిన 24 గంటల్లో ఉమ్మది ఆదిలాబాద్ జిల్లాల్లోని మంచిర్యాల, కుమ్రం భీం, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు కామారెడ్డి జిల్లాలో భారీ వర్షపాతం నమోదు అయింది. రాష్ట్రంలోనే అత్యధికంగా కామారెడ్డి జిల్లా పోతరాజంపేటలో 128.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 126.5 మిల్లీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పోచ్చెరలో 103.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.
తెలంగాణ వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాల పట్ల అన్నదాత హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే చాలా జిల్లాల్లో దుక్కులు దున్నుకుని విత్తనాలు వేసేందుకు రెడీగా ఉన్నారు రైతులు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పత్తి విత్తనాలు వేశారు. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పత్తి పంటకు అనుకూలంగా ఉండనున్నాయి.