తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుణుడు బీభత్సం సృష్టించాడు. బుధవారం వేకువజామున్న ఒక్కసారిగా ఈదురు గాలులతో కుండపోత వర్షం కురియడంతో చెట్లు నేలకొరిగాయి. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం నీటి మునిగి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి క్షేత్రంలో కూడా భారీ వర్షం కారణంగా ఆలయ క్యూలైనల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. అంతేకాకుండా గుట్టపైకి వెళ్లేందుకు నిర్మించిన నూతన ఘాట్ రోడ్ భారీ వర్షానికి కోతకు గురైంది.
దీంతో గుట్టపైకి రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో పాటు బస్టాండ్‌లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. అయితే.. వేసవికాలం భక్తుల సౌకర్యార్థం కొండపైన వేసిన చలువ పందిళ్లు.. వర్షం ధాటికి నేలకొరిగాయి. ఆలయంలోకి వచ్చి చేరిన వర్షపు నీటిని తొలగించేందుకు ఆలయ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే ఆలయంలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.