రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు తెలుసుకునే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా నేడు ములుగులో మంత్రి హరీశ్‌రావు ఈ సర్వేను మొదలుపెట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 18 ఏండ్లు నిండిన 7 లక్షల మందికి పలు రకాల వైద్య పరీక్షలు చేయబోతున్నారు. ఇందుకోసం ములుగు జిల్లాలో 153 హెల్త్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సర్వే ప్రక్రియను ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని హెల్త్ ఆఫీసర్లు టార్గెట్‌గా పెట్టుకున్నారు.
పైలట్ ప్రాజెక్ట్‌లో వచ్చే సాధకబాధకాలను గుర్తించి, మార్పులు చేర్పుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టనున్నారు. మరోవైపు మంత్రుల పర్యటనలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయా జిల్లాల ఆఫీసర్లు పూర్తి చేశారు. ములుగు ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్చడమే కాకుండా రేడియాలజీ ల్యాబ్ భవన నిర్మాణాలకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేస్తారు. పిల్లల ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. తర్వాత నర్సంపేట, పరకాల నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.