Harish Rao : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహిస్తున్నది ఆశీర్వాద సభ కాదని, అది ముమ్మాటికీ రైతు వంచన సభేనని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జడ్చర్లలో నిర్వహించిన ఎస్ఐఆర్ (SIR) అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అడుగడుగునా రైతులను మోసం చేస్తూనే ఉందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రవర్తన, ఆయన మాట్లాడే తీరు పాలమూరు జిల్లా పరువు తీసేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ సమయాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్పింగులను (బైట్స్) సభలో ప్రదర్శించిన హరీష్ రావు.. సీఎం అనుచిత వ్యాఖ్యల వల్ల ముఖ్యమంత్రి కుర్చీ విలువ కూడా పూర్తిగా తగ్గిపోయిందని ఎద్దేవా చేశారు.
బోనస్.. బోగస్ అయింది.. యూరియా ఇవ్వడంలో సర్కార్ విఫలం
గత ఎన్నికల సమయంలో కేసీఆర్ ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా, ప్రజలకు ఏం కావాలో ముందే గుర్తించి పనులు చేసేవారని హరీష్ రావు గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతాంగానికి ఇచ్చిన బోనస్ హామీ అంతా ఒక బోగస్ వ్యవహారంగా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయని, మార్కెట్లలో తరుగు పేరుతో నిరుపేద రైతులను దారుణంగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. చివరకు రైతులకు సకాలంలో యూరియా ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. షాపుల్లో అసలు యూరియా స్టాక్ ఉంచడం లేదు కాబట్టే.. ఆ నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికి యాప్ లంటూ కొత్త కథలు మొదలుపెట్టారని దుయ్యబట్టారు.
జిల్లా మంత్రి జూపల్లి ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు
ఇదే క్రమంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు తీరుపై కూడా హరీష్ రావు చమత్కరించారు. జిల్లా మంత్రిగా ఉన్న జూపల్లి అసలు ఏం మాట్లాడుతాడో, ఎందుకు మాట్లాడుతాడో ఆయనకే అర్థం కాదంటూ ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలను పట్టించుకోవడంలో జిల్లా మంత్రులు, ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారని, కాంగ్రెస్ మార్క్ మోసపూరిత పాలనపై రైతాంగం తిరగబడే రోజులు దగ్గరపడ్డాయని హరీష్ రావు హెచ్చరించారు.

