సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజవర్గంలోని ఏర్పాటు చేసిన రేణుక ఎల్లమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మంజీరా నీళ్లు తెచ్చి ఎల్లమ్మ తల్లికి బోనాలు చేసినమని, నియోజకవర్గంలో ఉండి సేవ చేస్తున్న ఏకైక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో ఉండేవారని, ఈ నీళ్లు చూస్తే స్వర్గీయ మాణిక్ రెడ్డి సంబురపడేవారన్నారు. ఈ రోజు చాలా సంతోషంగా ఉందన్న హరీష్‌రావు.. రెండేళ్ల ముందే ఈ పథకం అయ్యేది.. కానీ కరోనా వచ్చి ఆలస్యమైందన్నారు. సింగూరు అంటే హైదరాబాద్ వాళ్ళది.. మంజీరా మీద చెక్ డ్యామ్ కడుతం అంటే అడ్డుపడ్డారు.. తెలంగాణ వచ్చింది కనుకే సింగూరు నీళ్లను మనం వాడుకుంటున్నామని ఆయన వెల్లడించారు.
Minister Harish Rao
కాళేశ్వరం నీళ్లు హైదరాబాద్ కి వచ్చాయి ఇదంతా కేసీఆర్ పుణ్యమని ఆయన కొనియాడారు. మల్లన్న సాగర్ కాలువతో సింగూరు నింపుతామని, వాన పడకముందే కాళేశ్వరంకి 9 వేల క్యూసెక్కుల నీరు వచ్చిందని ఆయన తెలిపారు. సింగూరు ఇక ఎండదు.. ఆందోల్ అద్భుతంగా తయారవుతుంది.. ఇంకా 3 కిలో మీటర్ల సొరంగం తవ్వితే సింగూరు ఎప్పటికి నిండే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మొత్తం లక్ష 80 వేల ఎకరాలకు నీరు వస్తుందని, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆందోల్ నియోజకవర్గంలో ఎక్కువ భూములకు నీరు ఇస్తున్నామని ఆయన తెలిపారు.
భూమి రేట్లు పెరిగినయి ఎకరం 50 లక్షలు అయ్యిందని, దయచేసి భూములు అమ్మకండని ఆయన ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ ఉన్నపుడు కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు పోతే వార్త అని ఆయన వ్యాఖ్యానించారు. డబుల్ డెక్కర్ ఇంజన్ అంటారు బీజేపోల్లు.. కర్ణాటకలో రైతులకు కరెంటు లేదంటూ ఆయన విమర్శించారు. ఇక్కడ ప్రతి గ్రామానికి సీఎం కేసీఆర్ 25 లక్షలు ఇచ్చారన్నారు.