Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్ట్ బనకచర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీని మొద్దు నిద్ర లేపింది బీఆర్ఎస్ అన్నారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరుగని పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ.. గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు చాలు అని చెప్పిన రేవంతుకు.. మిగులు జలాల్లోనూ తెలంగాణకు వాటా ఉంటుందని జ్ఞానోదయం చేసింది తమ పార్టీ అని ఆయన పేర్కొన్నారు. మళ్లీ పాత అబద్దాలను ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి.. అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఇప్పటికీ ఎందుకు డిమాండ్ చేయవు? అని ప్రశ్నించారు. చంద్రబాబు పట్ల నువ్వు చూపుతున్న గురు భక్తికి ఇది నిదర్శనం కాదా? అని అడిగారు. GWDT అవార్డు ప్రకారం, CWC అనుమతి పొందకుండా ఈఏసీ అనుమతి ఇవ్వదు అని హరీష్ రావు పేర్కొన్నారు.
Read Also: Mahavatar Narsimha: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో
ఇక, ఏపీ అనుమతుల కోసం CWCకి వెళ్లే కంటే ముందే అపెక్స్ కౌన్సిల్ కు వెళ్లాలనే సోయి కూడా సీఎం రేవంత్ రెడ్డికి లేదని హరీష్ రావు మండిపడ్డారు. కనీస అవగాహన లేని వ్యక్తులు నీటి పారుదల శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అన్నారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రస్తావనే రాని బనకచర్ల ప్రాజెక్టు, ఇప్పుడు ఎవరి అండ చూసుకొని ముందుకు వచ్చిందో తెలంగాణ ప్రజలకు తెలియదా? అని తెలిపారు. నువ్వు మౌనంగా ఉంటూ అందిస్తున్న సహకారం వల్లనే కదా బనకచర్ల వ్యవహారం ఇక్కడి దాకా వచ్చింది రేవంత్ రెడ్డి.. తెలంగాణ నీటి హక్కుల విషయంలో అన్యాయం చేస్తూనే, లెక్కకు మించి అబద్దాలు ప్రచారం చేస్తూ.. బీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న నీ క్షుద్ర రాజకీయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తుంది.. నీ తెలంగాణ వ్యతిరేక విధానాలను అసహ్యించుకుంటుందని మాజీమంత్రి హరీష్ రావు వెల్లడించారు.
