తెలంగాణలో నోటిఫికేషన్ల జాతర మొదలైంది. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వగా.. త్వరలోనే గ్రూప్ 4 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గ్రూప్ 4 నోటిఫికేషన్ పై సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నోటిఫికేషన్ త్వరగా ఇచ్చేలా ప్రయత్నాలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎప్రిల్ లో గ్రూప్ 1లో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ రోజు మే 31తో గ్రూప్ 1 అప్లికేషన్ గడువు ముగిసిపోయింది. ఏకంగా 3,35,143 దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి ఏపీలో 302 పోస్టులకు నోటిఫికేషన్ వేస్తే ఆ సమయంలో 3,02,912 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు ఒక్క తెలంగాణ నుంచే 3.35 లక్షల దరఖాస్తులు వచ్చాయి. సగటున ఒక్కో పోస్టుకు 666 మంది పోటీ పడుతున్నారు. భారీ కాంపిటీషన్ నెలకొంది.
అయితే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జూన్ చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉందని టీఎస్పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే గడువు తక్కవగా ఉండటంతో పాటు మార్కెట్లో మెటీరియల్ అందుబాటులో లేదు దీంతో మరికొంత గడువు కావాలని ఆశావహులు కోరుతున్నారు. గతంలో బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగానే వచ్చే రోజుల్లో గ్రూప్2,3,4 నోటిఫికేషన్లు విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.