Telangana Govt: అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడి టీచర్లుగా ప్రమోషన్ పొందే హెల్పర్ల గరిష్ట వయోపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం వల్ల 45 ఏళ్లు దాటిన హెల్పర్లకు ప్రయోజనం చేకూరనుంది. సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్యలో 4,322 మంది అంగన్వాడీ హెల్పర్లు ఉన్నారు. వీరందరికీ అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. టీచర్లుగా ప్రమోషన్ పొందాలి అనుకునే అంగన్వాడి హెల్పర్ల గరిష్ట వయసును 50 ఏళ్లకు పెంచే ఫైలుపై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేసింది. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయంపై మంత్రి సీతక్కకు అంగన్వాడి యూనియన్ లు ధన్యవాదాలు తెలిపారు.