Gandhi Hospital Doctors: సాధారణంగా రోగికి ఆపరేషన్ చేసే ముందు వైద్యులు మత్తు మందు ఇస్తారు. మత్తు మందు ఇవ్వకుండా సర్జరీలు పూర్తి చేయడం కష్టతరమైన ప్రక్రియ. అయితే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు మత్తు మందు ఇవ్వకుండానే ఓ రోగికి సర్జరీ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ మేరకు హైదరాబాద్ నగరానికి చెందిన ఓ 50 ఏళ్ల మహిళకు ట్యాబ్‌లో చిరంజీవి నటించిన అడవిదొంగ సినిమా చూపిస్తూ ఆమెతో మాట్లాడుతూ రెండు గంటలు సర్జరీ చేసి మొదడులోని కణతులను తొలగించారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి సర్జరీని వైద్య పరిభాషలో అవేక్ క్రేనియటోమీ అంటారని తెలిపారు. ఆపరేషన్ చేస్తున్న రెండు గంటల సమయంలో డాక్టర్లు సర్జరీపై దృష్టి పెడితే మిగిలిన సిబ్బంది ఆమెను పలకరిస్తూ సినిమాలోని స్టోరీ అడుగుతూ కాలక్షేపం చేశారు.
Read Also: Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’ సినిమా నుంచి డిలీట్ సీన్.. మీరూ ఓ లుక్కేయండి
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల గాంధీ హాస్పిటల్‌లో చేరింది. డాక్టర్లు అన్నీ టెస్ట్‌లు చేశారు. ఎక్సేరేలు తీయడంతో మెదడులో కణితి ఉన్నట్లుగా గుర్తించారు. అయితే సాధారణంగా ఆపరేషన్ చేస్తే ఆమె ప్రాణాలకు ప్రమాదకరమని స్పష్టం చేశారు. దీంతో అవేక్ క్రానియోటమీ నిర్వహించాలని వైద్యులు నిర్ణయించుకున్నారు. అవేక్ క్రేనియటోమీ అంటే మెదడు దెబ్బతినకుండా ఉండటానికి రోగికి మత్తు ఇంజక్షన్ ఇవ్వకుండా స్పృహలో ఉంచి చేసే సర్జరీ అన్నమాట. ఆపరేషన్ జరుగుతుందన్న ఊహే మహిళకు రానీయకుండా చేసి మెదడులోని కణతులను విజయవంతంగా తొలగించినట్టు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. కాగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై రోగులకు నమ్మకం సన్నగిల్లుతున్న వేళ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు మత్తుమందు లేకుండా సర్జరీ చేయడంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.